వైయస్ఆర్ సీపి ప్లీనరీ విజయవంతం
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత విజయవాడ గుంటూరు రహదారిని ఆనుకుని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ అంచనాలకు మించి విజయవంతం కావడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. 26 జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు ప్లీనరీకి తరలివచ్చాయి. గుంటూరు`విజయవాడ మధ్య జన మహా సముద్రాన్ని తలపించింది. జడివానను లెక్క చేయకుండా కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చారు. ప్లీనరీ ప్రాంగణం వద్ద గంటల తరబడి కాలుకదపకుండా నిల్చొని నాయకుల ప్రసంగాలు విన్నారు. నవరత్న పథకాలన్నీ అమలు చేయడం.. ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేయడం.. అన్ని వర్గాల ప్రజలు సీఎం వైఎస్ జగన్ పాలనను ఆదరిస్తుండటంతో ప్లీనరీకీ అభిమానసంద్రం పోటెత్తిందని చెబుతున్నారు.
ప్లీనరీ వేదికగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లను గెలుచుకోవడం సాధ్యమేని సీఎం వైయస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.కుప్పం క్లీన్ స్వీప్ సాధ్యమైంది, టార్గెట్ 175 సీట్లు కూడా సాధ్యమేనని ఉద్ఘాటించారు. పార్టీ గెలుపుపై సీఎం వైయస్ జగన్ పూర్తి భరోసా ఇచ్చారు. పార్టీ ప్రయాణాన్ని వివరిస్తూ ఉద్విగ్నంగా సీఎం వైయస్ జగన్ ప్రసంగం సాగింది. పార్టీ శ్రేణులకు ఫుల్ జోష్ ఇచ్చిన వైయస్ జగన్ ప్రసంగం. కార్యకర్తలకు సెల్యూట్ చేస్తూ వారి గొప్ప తనాన్ని సీఎం వైయస్ జగన్ చాటారు. కార్యకర్తల బాధ్యత సీఎం వైయస్ జగన్ తన భుజస్కందాల మీద వేసుకున్నారు. పార్టీ విజయాలకు మీరే కారణం, మీకు నేను అండగా ఉంటానన్న సీఎం వైయస్ జగన్. ఊరూరా వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా సైన్యం తయారవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపునిచ్చారు. మూడేళ్ల పాలనలో ప్రభుత్వ విజయాలను లెక్కలతో సహా వైయస్ జగన్ వివరించారు.
చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టడానికి గ్రామ గ్రామాన సైన్యంగా ఏర్పడాలని సూచించారు. టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని ప్రజలకు వివరించాలని చెప్పారు. చంద్రబాబుతో కూడిన కౌరవ సైన్యంపై గెలిచేందుకు అర్జునుడి పాత్ర పోషించాల్సింది మీరేనని శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నింపిన స్ఫూర్తి, కర్తవ్య బోధతో శ్రేణుల్లో కదనోత్సాహం నెలకొంది. వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలకు పెద్ద ఎత్తున హాజరై, ప్రభుత్వానికి మద్దతు తెలిపిన కార్యకర్తలు, అభిమానులకు సీఎం వైఎస్ జగన్ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘రాష్ట్రంలో మహాయజ్ఞం జరుగుతుంది. మరో 30 సంవత్సరాల భవిష్యత్తుకు కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా అభ్యుదయ మూలాలకు మూడు సంవత్సరాల్లో అడుగులు పడ్డాయి. ఇది మరింతగా బలపడాలంటే అందులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పాత్ర చాలా కీలకం. మీ తోడు, మీ దీవెనలు నన్ను ఇంతవాడిని చేశాయి.
జగన్ అనే నేను చెబుతున్నా.. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు నాదీ బాధ్యత’’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 13 సంవత్సరాలు అయిపోయింది. 13 ఏళ్లుగా ఇదే అభిమానం, ఇదే నమ్మకం నాపై చూపిస్తూ.. మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ హృదయ పూర్వకంగా.. రెండు చేతులు జోడిరచి శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.
విజయమ్మ రాజీనామా
తెలంగాణలో కూతురు షర్మిలకు మద్దతుగా నిలవాలన్న ఉద్దేశ్యం తో విజయమ్మ వైఎస్పార్సీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సారథ్యం వహిస్తున్న తన కుమార్తె షర్మిలకు అండగా నిలిచేందుకు పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్లీనరీలో ప్రకటించారు.
పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్రెడ్డి ఎన్నిక
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్సీ) పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికయ్యారు. వైయస్సార్సీపీ రెండు రోజుల ప్లీనరీ ముగింపు రోజున ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, పార్టీ రాజ్యాంగాన్ని సవరించి, జీవితకాలం అధ్యక్షుడిగా జగన్ ఎన్నికయ్యేలా ప్రక్రియను పూర్తి చేశారు. కాంగ్రెస్ను వీడి 2011 మార్చిలో వైఎస్ఆర్సీని జగన్ స్థాపించారు. అప్పటి నుంచి పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ కొనసాగుతున్నారు. ఇక.. చివరిసారిగా 2017లో జరిగిన పార్టీ ప్లీనరీలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జగన్ ఎన్నికయ్యారు.













