జూలై లో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ… భారీగా ఏర్పాట్లు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు వైఎస్ఆర్సీపీ ప్లీనరీని నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహించే పార్టీ ప్లీనరీని గుంటూరు-విజయవాడ రహదారిపై నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో విశాలమైన ప్రాంగణంలో నిర్వహించనున్నారు. 2017లో జరిపిన ప్రదేశంలోనే ఇప్పుడు కూడా ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జులై 8వ తేదీన ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం వరకు ప్లీనరీ జరుగుతుందన్నారు. పార్టీ నేతలందరూ ప్లీనరీకి సమాయత్తం కావాలని కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అతిథులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్లీనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అందరూ సమష్టిగా పనిచేయాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని తెలిపారు. ఐక్యమత్వానికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, వర్గాలను ప్రోత్సహించే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. దీనిని గుర్తించి నేతలందరూ ఐకమత్యంతో ముందుకు నడవాలని సూచించారు.













