Avinash Reddy: అవినాష్ రెడ్డి అరెస్ట్..హిట్ పెంచుతున్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు..
వైసీపీ (YSRCP) ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) పులివెందుల (Pulivendula) పోలీసుల చేత ముందస్తుగా అదుపులోకి తీసుకోబడ్డారు. శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపుతూ ఆయనను పులివెందుల నుంచి తరలించారు. వైఎస్సార్ జిల్లా (YSR District) పులివెందుల, ఒంటిమిట్ట (Ontimitta) ప్రాంతాల్లో ఈ రోజు జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కారణంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉప ఎన్నికలను అధికార కూటమి, వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కడప జిల్లా (Kadapa)లోని ఈ జెడ్పీ స్థానాలు వైసీపీకి గట్టి స్థావరంగా ఉండటంతో, వీటిని గెలుచుకోవడం ద్వారా పార్టీ బలం చూపాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న టీడీపీ (TDP) ఈ స్థానాలను గెలుచుకుని వైసీపీకి కఠినమైన సవాలు విసరాలని యోచిస్తోంది.
ఈ నేపథ్యంలో రెండు పార్టీలు బలమైన పోటీలో ఉన్నాయి. గెలుపు కోసం కృషి జరుగుతుండడంతో ఇరుపక్షాల కీలక నేతలపై పోలీసులు తమ నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు రాకుండా ఉండేందుకు పలువురిని హౌస్ అరెస్టు చేశారు. తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి తన ఇంటి ముందు నిరసన తెలిపారు. ఆయన నిరసన కారణంగా పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. ఈ పరిస్థితిలో పోలీసులు జోక్యం చేసుకుని, అక్కడున్న వైసీపీ కార్యకర్తలను వెనక్కి పంపించారు. వైసీపీ ఏజెంట్లపై టీడీపీ దాడులు జరిగే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితులను ఆపాల్సిన వారు తనపై చర్యలు తీసుకోవడం ఏమిటి అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.
ఎంపీని అదుపులోకి తీసుకోవడంతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వాహనంలో ఆయనను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి, మరోచోటుకు తరలించారు. పోలీసుల తీరుపై అవినాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతటి పరిస్థితిని ఇంతవరకు చూడలేదని, దాడులు ఆపాల్సిన అధికారులే తనపై చర్యలు తీసుకోవడంలో అర్థంలేదని అన్నారు.
ఇదిలా ఉంటే, వేంపల్లి (Vempalli)లో వైసీపీ నేత సతీష్ రెడ్డి (Satish Reddy)ను కూడా హౌస్ అరెస్టు చేశారు. ఒంటిమిట్టలో 24,600 ఓటర్లు ఉండగా, మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ రెండు ఉప ఎన్నికలు సాయంత్రం వరకు బ్యాలెట్ విధానంలో జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
పులివెందుల , ఒంటిమిట్ట ప్రాంతాల్లో మొత్తం 1,500 మంది పోలీసులను మోహరించారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఉన్న పోటీ ప్రధానంగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (Mareddy Latha Reddy) , వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి (Hemant Reddy) మధ్యనే నడుస్తోంది. ఈ స్థానంలో 10,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. రెండు పార్టీలూ గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుండటంతో ఈ ఉప ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఓటర్ల పై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి..







