ఎంపీ రఘురామ కృష్ణరాజును అరెస్టు చేసిన… సీఐడీ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును హైదరాబాద్‍లో ఆంధప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రఘురామపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆంధప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. అయితే మొదట్లో వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు. రఘురామ భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చారు. ఎంపీ రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చ జరుగుతోంది.
పుట్టిన రోజు నాడే మా నాన్నను అరెస్టు చేశారని ఆయన కుమారు భరత్ ఆరోపించారు. ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగి మూడు నెలలే అయ్యిందని అన్నారు. మఫ్టీలో వచ్చింది సీఐడీ అధికారులా, రౌడీలా అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అకస్మాత్తుగా వచ్చి మా నాన్నను తీసుకెళ్లారు. వై కేటగిరీ భద్రత ఉన్న ఎంపీని బలవంతంగా తీసుకెళ్లారు. న్యాయవాదితో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఎంపీని ఎలా అరెస్టు చేస్తారు? ప్రభుత్వం చేసే తప్పును ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? మా నాన్నకు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు అని భరత్ ఆందోళన వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.. అరెస్టు చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపుతోంది.