R.Krishnaiah : వైసీపీకి ఆర్.కృష్ణయ్య గుడ్ బై..! బీజేపీలో కీలక పదవి ఖరారు..!?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) వరుస షాకులు తగులుతున్నాయి. ఏపీలో (AP) ఆ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఓడిపోయిన నేతలు పార్టీని వీడడం కామన్. అయితే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం వైసీపీకి గుడ్ బై చెప్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజ్యసభ ఎంపీలు (Rajyasabha MP) మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్ రావు (Bida Masthan Rao) ఇప్పటికే రాజీనామాలు చేసేశారు. తాజాగా బీసీ నేత ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన బీజేపీలో (BJP) చేరడం దాదాపు ఖాయమైంది. ఆయనకు జాతీయ స్థాయిలో కీలక పదవి కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
తాజా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) దారుణ పరాజయం చవిచూసింది. దీంతో ఆ పార్టీలో ఉంటే మనుగడ కష్టమని భావిస్తున్న పలువురు నేతలు బయటికొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో టీడీపీ (TDP) కీలక పాత్ర పోషిస్తుండడంతో ఐదేళ్లపాటు తమకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనలో ఉన్నారు పలువురు నేతలు. అందుకే వీలైనంత త్వరగా బయటికొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం మారి వంద రోజులైంది. అప్పుడే చాలా మంది నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు రాజ్యసభలో ఇంకా నాలుగేళ్లపాటు కొనసాగే అవకాశం ఉన్నా ఆర్.కృష్ణయ్య రాజీనామా చేయడం సంచలనం కలిగించింది.
తెలంగాణకు (Telangana) చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు జగన్ ఏరికోరి పదవి ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఆర్.కృష్ణయ్య ఎమ్మెల్యేగా (MLA) పోటీ చేసి ఓడిపోయారు. రెండేళ్ల కిందట ఆయనకు రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వడం ద్వారా బీసీలను మచ్చిక చేసుకోవాలనుకున్నారు. ఆయన నిర్ణయాన్ని పార్టీలోని పలువురు బీసీ నేతలు తప్పుబట్టినా జగన్ (YS Jagan) పట్టించుకోలేదని చెప్తారు. ఆర్.కృష్ణయ్యకు పదవి ఇచ్చినా ఆయన ఏనాడూ పార్టీకోసం పని చేయలేదని చెప్తుంటారు. ఇప్పుడాయన ఏకంగా పార్టీని వీడారు. 2026 వరకూ కృష్ణయ్య పదవీకాలం ఉంది. రాజ్యసభలో వైసీపీకి మొత్తం 11 మంది సభ్యులుండేవారు. ఇటీవల ముగ్గురు రాజీనామా చేయడంతో వైసీపీ బలం 8కి పడిపోయింది. త్వరలోనే మరికొందరు వీడుతారని సమాచారం.
వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆర్.కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరతారని అందరూ అనుకుంటున్నారు. గతంలో ఆ పార్టీతో కృష్ణయ్యకు అనుబంధం ఉంది. అయితే ఆర్.కృష్ణయ్య మాత్రం బీజేపీలో (Telangana BJP) చేరబోతున్నారు. వాస్తవానికి ఆర్.కృష్ణయ్య బీసీలకోసం ఓ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే ఆయన్ను పార్టీలోకి తీసుకుని కీలక పదవి అప్పగించడం ద్వారా తెలంగాణలో బీసీల ఓటుబ్యాంకును తమవైపునకు తిప్పుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తోంది. పార్టీలో చేర్చుకున్న అనంతరం జాతీయ బీసీ కమిషన్ పగ్గాలను ఆర్.కృష్ణయ్యకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఆర్.కృష్ణయ్య స్థానంలో ఓ వ్యక్తిని బీజేపీ తరపున రాజ్యసభకు పంపనుంది. తద్వారా రాజ్యసభలో తన బలాన్ని పెంచుకోనుంది.













