Vizianagaram MLC : విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికపై ఉత్కంఠ..!!
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అదే సమయంలో విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా మొదలైంది. అయితే ఈ స్థానం నుంచి గెలిచిన ఇందుకూరి రఘురాజపై సస్పెన్షన్ చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.
విజయనగరం స్థానిక సంస్థల నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన ఇందుకూరి రఘురాజు గతంలో విజయం సాధించారు. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇందుకూరి రఘురాజు భార్య సుధారాణి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఇందుకూరి రఘురాజు కూడా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది వైసీపీ. అదే సమయంలో ఆయన ఎమ్మెల్సీగా అనర్హుడని.. ఆయనపై వేటు వేయాలని మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఇందుకూరి రఘురాజు అనర్హుడని జూన్ 2న తీర్పు చెప్పారు.
ఇందుకూరి రఘురాజుకు 2027 నవంబర్ వరకూ పదవీకాలం ఉంది. దీంతో తనపై వేటు వేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఇదే సమయంలో మండలి ఛైర్మన్ ఆదేశాల మేరకు ఈ స్థానాన్ని వేకెంట్ గా పరిగణిస్తూ ఉప ఎన్నికలకు ఈ నెల 3 షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరపున శంబంగి వెంకట చిన అప్పలనాయుడిని బరిలోకి దింపుతున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఆయన ఈ మేరకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే రఘురాజు పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 6న ఆయనపై అనర్హత చెల్లదని తీర్పు చెప్పింది.
హైకోర్టు తీర్పు ప్రకారం రఘురాజు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతారు. అయితే అప్పటికే ఎన్నికల సంఘం ఈ స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేయడం.. దానికి నామినేషన్లు కూడా షురూ కావడంతో ఈ ఎన్నిక జరుగుతుందా.. జరగదా.. అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ లేఖ రాశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది. అయితే ఈ లోపు నామినేషన్ల పర్వం మాత్రం కొనసాగుతోంది. వైసీపీ తరపున శంబంగి వెంకట చిన అప్పలనాయుడు రెండో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు టీడీపీ తరపున ఇందుకూరి రఘు రాజు భార్య ఇందుకూరి సుధారాణి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఈ స్థానంలో వైసీపీకి తగినంత బలముంది. దీంతో మొదట్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు టీడీపీ తరపున కూడా అభ్యర్థి బరిలోకి దిగడంతో ఎన్నికపై మరింత ఉత్కంఠ ఏర్పడింది.













