151 మందిని మార్చినా రాష్ట్రంలో.. వైసీపీ గెలిచే పరిస్థితి లేదు : చంద్రబాబు
వైసీపీ నావకు చిల్లు పడింది. బయటపడే పరిస్థితి లేదు. దూకి పారిపోతే ప్రాణాలు కాపాడుకుంటారు. లేకపోతే కొట్టుకుపోతారు. ఇప్పటికే ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో సైకిల్ స్పీడ్ మరింత పెరుగుతుంది. ఫ్యాన్ తిరగడం ఆగిపోతుంది. వారితో విభేదించారనే నెపంతో ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో టార్చర్ చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం? జగన్ అన్ని సంప్రదాయాలను సర్వనాశనం చేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడారా? రాష్ట్రంలో అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారు. ఎన్నికలకు ముందు ముద్దులు, ఇప్పుడేమో పిడిగుద్దులు. జగన్ ఒక అపరిచితుడు. చెప్పింది ఒక్కటీ చేయరు. తల్లికి, చెల్లికి కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వరు. వైసీపీలో 11 మంది ఇన్ఛార్జిలను మార్చారు. 151 మందిని మార్చినా రాష్ట్రంలో వైసీపీకి గెలిచే పరిస్థితి లేదన్నారు.
రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోంది. ఎవరూ ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం. వెనుకబడిన వర్గాలను బలపరిస్తేనే సామాజిక న్యాయం. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. కేంద్రం మెడలు వంచలేదు కానీ, కేంద్రం వద్ద మెడలు దించారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయి. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే వాళ్లం. పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయి. కానీ, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. దేశంలోనే అత్యధికంగా ఏపీలో 24 శాతం నిరుద్యోగం ఉంది అని అన్నారు.













