కబడ్డీ ఆడిన రోజా..! వాట్ యాన్ ఎనర్జీ జీ..!
పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందారు రోజా.! డేరింగ్, డ్యాషింగ్ ఉమెన్.. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆమె నైజం. రాజకీయాల్లో కూడా తనదైన దూకుడుతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గానికి ఆమె ఎమ్మెల్యే. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా కూడా ఉన్నారు. పలు టీవీషోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రోజా కూడా ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. నగిరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో ఆమె ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో నిండ్రలో జరుగుతున్న కబడ్డీ టోర్నమెంట్ ను రోజా ప్రారంభించారు. ఆ సమయంలో సరదాగా ఆమె కూడా కూత కూశారు.
తొలిరోజు తిరువేలంగాడు, రేణిగుంట జట్ల మధ్య పోటీ జరిగింది. టోర్నమెంట్ ను ప్రారంభించిన అనంతరం కాసేపు అక్కడే గడిపారు రోజా. అనంతరం ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా బరిలోకి దిగారు. మొదట రేణిగుంట జట్టు తరపున కూత కూశారు. ఆ తర్వాత తిరువేలంగాడు జట్టు తరపున కూడా ఆడారు.
తను చదువుకునేటప్పుడు కబడ్డీ బాగా ఆడేదాన్నని చెప్పుకొచ్చారు రోజా. తనకు కబడ్డీ అంటే చాలా ఇష్టమని.. అయితే ఇప్పుడు ఆడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడిన కాసేపు మాత్రం రోజా ఫుల్ జోష్ లో ఆడారు. అక్కడున్నవారంతా రోజా ఎనర్జీ లెవల్స్ చూసి షాక్ కు గురయ్యారు. మాటల్లోనే కాదు.. ఆటల్లో కూడా రోజా విరుచుకుపడగలదని భావించారు.













