వైకాపాకు మరో షాక్.. టీడీపీలో చేరనున్న కీలకనేత అవసరార్దమా..
తూర్పుగోదావరి జిల్లాముమ్మిడివరం నియోజక వర్గానికి చెందిన గుత్తుల వెంకటసాయి శ్రీనివాసరావు టీడీపీలో చేరెందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శ్రీనివాసరావు రాకతో ముమ్మిడివరంలో టీడీపీకి ఆయన సామాజిక వర్గం శెట్టిబలిజ ఓటు బ్యాంకు ప్లస్ కాబోతుంది. ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప సమక్షంలో మంతనాలు జరిపి పార్టీలో గుత్తుల సాయికి సముచిత స్థానం కల్పించి ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అమరావతిలో ఈ నెల 14వ తేదీన ఒంటిగంటకు టీడీపీలో చేర్చేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. 12వ తేదీన వైసీపీకి సాయి రాజీనామా చేయనున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి బీసీ సామాజికవర్గంవారు గుత్తుల సాయి వెంట టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
ఈ నెల 14వ తేదీ ఉదయం 7 గంటలకు ముమ్మిడివరం నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకులు 8 బస్సులు, 60 కార్లలో భారీఎత్తున సాయువెంట అమరావతి వెళ్లనున్నారు. దీంతో టీడీపీ గుత్తుల సాయి, అతని సామాజికవర్గాన్ని తమ పార్టీ వైపు మలుచుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఇప్పటికే రెండు, మూడుసార్లు జిల్లామంత్రుల సమక్షంలో సాయిని పార్టీలో చేర్చే విషయంపై చర్చించి భవిష్యత్లో పార్టీలో తగిన గుర్తింపు ఇచ్చేలా హామీను కూడా ఇచ్చినట్టు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికనాటికి గుత్తుల సాయి సామాజికవర్గాన్ని టీడీపీవైపు మలుచుకుని పార్టీని నియోజకవర్గంలో మరింత బలిష్టం చేసే ప్రయత్నాలు అనుకుంటున్నారు. ఉభయ గోదావరి లో తెలుగుదేశం ఓటింగ్ తగ్గిందన్న నేపద్యంలో ఇది పెద్ద విషయం కాదని వారి కుల వర్గపు మంత్రి నేత వ్యూహరచనలో భాగమే ఇదని కాపు వర్గమంతా ఒక ప్రక్కగా వుంటున్నారని బిసి వర్గాన్ని పూర్తిగా తమ ప్రక్కకు తిప్పుకుంటే మంచిదన్న అబిప్రాయం తో చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.













