రఘురామా? ఏమి నీ ధీమా?
-ఎంపీకి వైసీపీ నోటీసులు
గత కొంత కాలంగా స్వపక్షంలోనే వైరి పక్షంలా మారారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఆయన భాజాపా తో చెలిమి కోరుకుంటున్నారని, వైసీపీకి దూరమవుతున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు నేరుగా తమ పార్టీ అధిష్టానాన్ని ఏమీ అనకుండానే పార్టీలోని ఇతర నేతలతో రఘురామ కృష్ణంరాజు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ గొడవ మరింత రాజుకుంది. వైకాపాలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు రఘురామ కృష్ణంరాజుపై కారాలు మిరియాలు నూరడం, టీవీ చర్చల్లో ఆయన తో వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అంటుండడం కనిపిస్తోంది. అంతేకాకుండా నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఎంపీ దిష్టిబొమ్మలను వైకాపా కార్యకర్తలు దగ్ధం చేశారు. దీనికి కూడా ఎంపీ ఘాటుగానే స్పందించారు. అంతటితో ఊరుకోకుండా స్వంత పార్టీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఇవన్నీ ఇప్పటి దాకా మౌనంగా గమనిస్తూ వచ్చిన వైకాపా అధిష్టానం ఇక ఈ గొడవకు ఫుల్స్టాప్ పెట్టదలచుకుంది. ఎంపీతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది. అందులో భాగంగానే బుధవారం వైకాపా అధి నాయకత్వం ప్రత్యక్ష చర్చలకు పూనుకుంది. నర్సాపురం ఎంపీకి నోటీసులు జారీ చేసింది. గత కొంత కాలంగా ఆయన పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలపై వివరణ కోరింది. ముఖ్యంగా టీవీ చర్చల్లో ఆయన పార్టీ నియమావళిని అతిక్రమించి మాట్లాడారని నోటీసుల్లో స్పష్టం చేసింది. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఇప్పటిదాకా పార్టీలో ఇతర నాయకులతో మాత్రమే తలపడిన ఎంపీ.. ఇప్పుడు నేరుగా అధిష్టానంతో తలపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో ఆయన తన వైఖరి మార్చుకుంటారా? లేక తన పాత పంథా కొనసాగిస్తారా? అనేది ఆసక్తి కరంగా మారింది.













