తప్పుడు ప్రకటనలు మానుకొని.. ఎయిమ్స్ సమస్యకు పరిష్కారం
వైద్యరంగంపై సీఎం జగన్ తప్పుడు ప్రకటనలు మానుకొని, తొలుత ఎయిమ్స్‌లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్‌కు కనీస నీటి సరఫరా చేయలేని ప్రభుత్వాన్ని ఏమనాలని మండిపడ్డారు. అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలని ఆక్షేపించారు. ఈ మూడున్నరేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో ఎయిమ్స్‌కు భూములు ఇచ్చి, వసతలు కల్పించి వైద్య సేవల నిమిత్తం ప్రతిష్ఠాత్మక సంస్థను సిద్ధం చేశామని తెలిపారు. అటువంటి సంస్థ పెరిగిన తమ అవసరాల కోసం అదనంగా నీటి వనరులను సమకూర్చాలని లేఖలు రాసినా పరిష్కారించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు.
రాష్ట్రంలో మెడిక్ కాలేజ్‌లు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీ సైతం అసత్యాలు పలికిన సీఎం తానుంటున్న మున్సిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సీఎం స్పందించలేదన్నారు. వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే జరిగాయని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్డి చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదని హితవు పలికారు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్‌కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.













