తెరాస తప్పులనే వైకాపా చేస్తుందా…?
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటని దానిని పక్కన పెడితే కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం అధికార వైసిపి ఘోరంగా తప్పులు చేస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రధానంగా ఏకగ్రీవాల విషయంలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాజకీయంగా బలంగా ఉండటంతో ఏకగ్రీవాలు విషయంలో అధికార వైసీపీ నేతలు దూకుడు చూపించడంతో తీవ్రస్థాయిలో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
రాజకీయంగా బలంగా ఉన్న నేపథ్యంలో తాము ఏం చేసినా చెల్లుతుంది అనే భావనలో ఉన్న కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది విషయంలో కాస్త కఠినంగానే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొంతమంది నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్నారు అనే ఆవేదన ముఖ్యమంత్రి జగన్ లో కూడా కాస్త ఎక్కువగానే ఉంది. అందుకే కొంతమంది ని కట్టడి చేసే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేదు అనే విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసిపి ప్రభావం చూపించే అవకాశాలు పెద్దగా కనపడటం లేదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు కాస్త చర్యలకు దిగే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కి కొంతమంది అవకాశం ఇస్తున్నారని… మీడియా వర్గాలు అన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్న సరే వైసీపీ నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కూడా అధికార పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తుంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లాలి. కానీ వైసీపీ నేతలు ఈ అంశంలో వెనక్కి అడుగు వేస్తున్నారు. ఇక కార్యకర్తలను ముందుకు నడిపించే విషయంలో కూడా కొంతమంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. తమకు ఓటు వేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని హెచ్చరించడంతో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఈ వ్యాఖ్య ఎక్కువగా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసే సమయంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజలను బెదిరించారని ఆరోపణలు వినిపించాయి. కాబట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు జగన్ కూడా కొంతమందికి సంబంధించి నివేదిక తెప్పించుకున్నారట.













