వైసీపీ ఫైర్ బ్రాండ్స్ కు ఏమైంది..?
ప్రభుత్వంలో ఉండగా వైసీపీలో గజానికో ఫైర్ బ్రాండ్ కనిపించారు. ఏదైనా విషయం దొరికితే చాలు టీడీపీ, జనసేనపై ఫైరయ్యేవారు. ఇక ఇందులో ముతకభాష వాడే నేతలు కొందరైతే.. మరికొందరు సబ్జెక్ట పట్టుకుని చీల్చి చెండాడే వారు. ప్రభుత్వం మారగానే ఈ ఫైర్ బ్రాండ్స్ కనపడడం మానేశాయి. ఏ ఘటన జరిగినా అమరనాథ్, బొత్స సత్యన్నారాయణ లాంటి కొందరు నేతలు మాత్రమే కనిపించి వివరణ ఇచ్చి వెళ్తున్నారు. దీంతో వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ కు ఏమైంది అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.
కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు… ఇలా అనేక మంది నాయకులు ఫైర్ బ్రాండ్లుగా చలామణి అయ్యారు. పెద్ద ఎత్తున మీడియాలోనూ హల్చల్ చేశారు. పార్టీ పవర్ కోల్పోయి.. 50 రోజులు అయిపోయింది. అయితే.. ఈ మధ్య కాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్రామీణ, పట్టణ, నగర స్థాయిలోనూ.. జిల్లా స్థాయిలోనూ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఢిల్లీలో ధర్నా కూడా చేశారు.
మరోవైపు అసెంబ్లీలో శ్వేత పత్రాల పేరుతో సర్కారు జగన్ పాలనను ఏకేసింది. మరి ఇంత జరిగినా.. ఫైర్ బ్రాండ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకు రాలేదు. వినుకొండలో జరిగిన హత్యకు సంబంధించి స్థానికంగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు వంటి నాయకులు మాట్లాడాలి. కానీ, ఎక్కడో అనకాపల్లిలో ఉన్న గుడివాడ అమర్నాథ్ స్పందించారు. మొత్తంగా చూస్తే.. వైసీపీలో బలమైన గళం వినిపించే నాయకులు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. మరి దీనికి కారణం ఏంటి? అంటే.. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లకు సంబంధించి అరెస్టయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితే తమకు కూడా పడుతుందని ఫైర్ బ్రాండ్లు అంచనా వేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇదే నిజమైతే.. మున్ముందు.. ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి ఉండదనే భావించాలి.













