అందరి సహకారంతోనే రెండేళ్ళ పాలన దిగ్విజయం

రాష్ట్రంలోని ప్రజలందరి సహకారంతో తమ ప్రభుత్వం రెండేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్‍రెడ్డి అన్నారు. వైఎస్సార్‍సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. తమ రెండేళ్ళపాలనలో 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు.. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగాం. రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను పూర్తి చేశాం. రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉంది. రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నానని’’ సీఎం జగన్ అన్నారు.
వై.ఎస్. జగన్ పాలనకు పేరు తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్‍మోహన్ రెడ్డి రెండేళ్ళ పాలనా కాలంలో ముఖ్యమైనది గ్రామవార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు. పాలనలో విప్లవాత్మక మార్పులకు ఈ ఏర్పాటు శ్రీకారం చుట్టింది. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ముందు.. గ్రామాలలో ఎవరికి ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతుందో ఆ ఊళ్లో వాళ్లకు సైతం సరిగా తెలిసేది కాదు. అర్హత ఉన్నప్పటికీ పథకాలు అందకపోతే ఎవరిని అడగాలో తెలిసేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామ సచివాలయంలో ప్రతి పథకం లబ్ధిదారుల జాబితాను అందరికీ కనిపించేలా నోటీసు బోర్డులో పెడుతున్నారు. ఎవరి దరఖాస్తును అయినా తిరస్కరిస్తే, అందుకు గల కారణాన్ని కూడా సూచిస్తూ వివరాలు నోటీసు బోర్డులో ఉంచుతున్నారు. సచివాలయాల్లో ప్రస్తుతం ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్ పద్ధతిలోనే అమలవుతున్నాయి. ప్రతి చోటా రెండు కంప్యూటర్లు, ఒక ప్రింటర్, ఒక ల్యామినేషన్ మిషన్, ఐరిష్ స్కానింగ్ మిషన్, ప్రతి ఉద్యోగి వద్ద ఒక ఫింగర్ ప్రింట్ మిషన్ వంటివి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయాల కోసం కొత్త భవనాల నిర్మాణం కూడా చేపట్టింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సమానంగా 545 రకాల సేవలు అందిస్తోంది.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సచివాలయాల్లో పని చేసేందుకు 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించారు. ఆరు నెలల సమయంలోనే వాటిని భర్తీ కూడా చేశారు. ఇన్ని ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి, త్వరితగతిన భర్తీ చేయడం దేశ, రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయింది. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడితే.. చిన్న తప్పు కూడా దొర్లకుండా యూపీఎస్‍సీ స్థాయిలో రాత పరీక్షలు నిర్వహించారు. కేవలం నెల రోజుల వ్యవధిలోపే ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందజేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పని తీరును ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాయి. కేంద్ర ప్రభుత్వం సహా ఎన్నో సంస్థలు ప్రశంసించాయి. జగన్ పాలనలో ఇది ఒక ప్రత్యేకమైనదిగా నిలిచింది.
అలాగే కొన్ని పథకాలు కూడా జగన్‍కు మరింత పేరును తీసుకువచ్చాయి. ప్రజలకు దగ్గర చేశాయి. పెన్షన్ మొదలు ఏ పథకమైనా గడప ముందుకొచ్చేలా పనిచేస్తున్నారు.అమ్మఒడి వలంటీర్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయాలు ఇంటివద్దకే రేషన్ సరుకులు ఆరోగ్యశ్రీ కాపునేస్తం వైఎస్‍ఆర్ రైతు భరోసా వాహనమిత్ర జగనన్న విద్యాదీవెన వసతి దీవెన చేయూత వంటి కార్యక్రమాలు జగన్ ను ప్రజలకు చేరువ చేశాయి.
హెల్త్ హబ్‍ల ఏర్పాటు
ఆంధప్రదేశ్ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక ద•ష్టి సారించింది. కరోనా నేపథ్యంలో ఎదురైన సవాళ్లను ద•ష్టిలో ఉంచుకుని.. రాష్ట్రంలో హెల్త్ హబ్‍లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కోవిడ్‍పై సమీక్ష సీఎం వైఎస్ జగన్.. ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందని అంటూ, జిల్లా ప్రధాన కేంద్రాలు, ఆ జిల్లాల్లోని నగరాల్లో హెల్త్ హబ్ లను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో కనీసం 16 చోట్ల ఈ హెల్త్ హబ్‍లను ఏర్పాటు చేయాలని.. జిల్లా కేంద్రాలతోపాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి కలుపుకుని మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్‍లు ఉండాలని సూచించారు. ఒక్కో చోట కనీసంగా 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలని.. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున కేటాయించాలని ఆదేశించారు. మూడేళ్లలో కనీసంగా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఈ భూములు ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. దీనివల్ల కనీసంగా 80 మల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు వస్తాయని పేర్కొన్నారు. వీటితోపాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్యకళాశాలలు, నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వపరంగా ఆరోగ్య రంగం బలోపేతం కావడంతోపాటు, మనం ఇచ్చే ప్రోత్సాహం కారణంగా ప్రైవేటు రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లాకేంద్రంలో, కార్పొరేషన్లలో మల్టీస్పెషాల్టీ, స్పెషాల్టీ ఆస్పత్రులు వస్తాయన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు కూడా మంచి ప్రమాణాలతో వైద్యం అందుతుందన్నారు. ఒకనెలరోజుల్లో కొత్త పాలసీని తీసుకురావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.