YSRCP: రెంటపాళ్ళ ఘటనను వైసీపీ రాజకీయం చేస్తోందా..?

పల్నాడు జిల్లా (Palnadu) సత్తెనపల్లి (Sattenapalli) నియోజకవర్గంలోని రెంటపాళ్ళ (Rentapalla) గ్రామ ఉప సర్పంచ్ కోర్లకుంట నాగమల్లేశ్వర రావు (Korukuntla Naga Malleswara Rao) మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024 జూన్ 8న నాగమల్లేశ్వర రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ సంఘటనపై వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ఇవాళ రెంటపాళ్ళలో నాగమల్లేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ (YCP) నేతలు టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, టీడీపీ (TDP) ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఎన్నికల ఫలితాల తర్వాత, జూన్ 5న నాగమల్లేశ్వర రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే జూన్ 8న చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందంటూ నాగమల్లేశ్వర రావు భారీగా బెట్టింగ్‌లు కాసినట్లు ఆరోపణలున్నాయి. ఆయన సొంత డబ్బు కోటిన్నర, మధ్యవర్తిగా మరో కోటిన్నర పందెం కాశారని సమాచారం. వైసీపీ ఓటమితో ఆ డబ్బులు చెల్లించలేక ఆర్థిక ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. పైగా ఈయన పురుగుల మందు తాగినప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు.
నాగమల్లేశ్వర రావు మరణానికి టీడీపీ రెడ్ బుక్ రాజకీయాలు, పోలీసుల వేధింపులు కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు నాగమల్లేశ్వర రావు ఇంటిపై దాడి చేసి, పోలీసుల ద్వారా ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించారని వైసీపీ నాయకులు పేర్కొంటున్నారు. టీడీపీ నాయకులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నాగమల్లేశ్వర రావు మరణించినప్పుడు టీడీపీ అధికారంలో లేదని, వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని వారు స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, వైసీపీ ఓటమి కారణంగా నాగమల్లేశ్వర రావు మానసిక ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడ్డారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ ఘటనను టీడీపీతో ముడిపెట్టడం ద్వారా వైసీపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని, దీనిని కుట్ర కోణంలో భాగంగా టీడీపీ చూస్తోంది.
నాగమల్లేశ్వర రావు మరణం రెంటపాళ్ళ గ్రామంలోని స్థానికులను కలచివేసింది. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో విభజన రేఖలను సృష్టించింది. ఒకవైపు వైసీపీ ఈ సంఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, టీడీపీ దీనిని వైసీపీ రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తోంది. దీంతో నాగమల్లేశ్వర రావు మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదాస్పద అధ్యాయంగా మారింది. వైసీపీ దీనిని టీడీపీపై రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తుండగా, టీడీపీ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. ఈ ఘటన రాజకీయ లాభాల కోసం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది.