బుజ్జగింపుల పర్వంలో వైసీపీ..
మీ పనితీరు బాగోలేదు…మీపై తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే మారుస్తున్నాం… పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సముచితస్థానం కల్పిస్తామంటూ హైకమాండ్ తెగేసి చెప్పింది. అంతేకాదు.. కొందరికైతే విజయసాయి, వైవి సుబ్బారెడ్డి, సీఎంవో కార్యాలయం ప్రతినిధులతో చెప్పించింది. ఈ పరిణామంపై సీనియర్లు సైతం నొచ్చుకున్నారు. ఇలా చెప్పాల్సింది కాదన్న భావన.. వారిమాటల్లో వ్యక్తమైంది. ఇప్పుడు మార్పులు, చేర్పులు ఓ కొలిక్కి వచ్చాక.. మార్పులు జరిగిన స్థానాలపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది.
15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మారిన రాజకీయ పరిణామాలపై వచ్చిన నివేదికలు, అందిన సమాచారం నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు ఆత్మ రక్షణలో పడింది. దీనికి కారణం.. తమకు ఎవరో ప్రత్యేకంగా శత్రువులు రాలేదు. తమ వారే తమకు శత్రువులుగా మారుతుండడమే! ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనని ఐప్యాక్ టీం తాజాగా వెల్లడించింది. ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకే… అంటూ.. ఎడా పెడా నాయకులను పార్టీ అధిష్టానం మార్చేసింది. ఇది రాజకీయ వ్యూహాలు.. ఎన్నికల వ్యూహాల్లో భాగమైతే కావొచ్చు. పార్టీ బలోపేతానికి, వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ఒక అవకాశం అయితే కావొచ్చు. కానీ, పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో నాయకుల ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. దీంతో అధిష్టానం చేసిన మార్పులను క్షేత్రస్థాయిలో కేడర్ జీర్ణించుకోలేకపోతోంది.
ఒకసారి 11, తర్వాత 23, మళ్లీ 19, తర్వాత 9 నియోజకవర్గాలు(అసెంబ్లీ, పార్లమెంటు)కు సంబంధించి నాయకులను మార్చుతూ.. చేర్చుతూ పార్టీ అధిష్టానం జాబితాలు విడుదల చేసింది. దీనిలో టికెట్లు దక్కని వారు కొందరు.. ఉంటే.. నియోజకవర్గాల మార్పు అయిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇలా నియోజకవర్గాల్లో మార్పు జరిగిన వారికే ఇప్పుడు అసలు సిసలు పరీక్ష ఎదురవుతోంది. నిన్న మొన్నటి వరకు ఓ నాయకుడి వెంట తిరిగిన కేడర్.. ఇప్పుడు కొత్తనేతకు అలవాటు పడడం.. ఆయనతో తిరగడం అంతా అయోమయంగా ఉంది.
ఈయన ఏం చేస్తాడో తెలియదు. అంటూ.. కేడర్ క్షేత్రస్థాయిలో వ్యాఖ్యానిస్తోంది. అంతేకాదు.. కొత్త నేతలకు .. మార్చిన నియోజకవర్గాల్లో కేడర్‌ను పరిచయం చేసుకునే సమయం కూడా లేకుండా పోయింది. దీనికితోడు టికెట్ ఆశించిన వారికి అవకాశం లేకపోవడంతో మెజారిటీ నాయకులు ఎస్కేప్ అయ్యారు. కొత్త నేతలకు సహకరించేదిలేదని.. పోన్ల ద్వారా తమ తమ వర్గాలకు సందేశాలు పంపుతున్నారు. దీంతో మార్పులు జరిగిన నియోజకవర్గంలో వైసీపీ కేడర్ స్తబ్దతగా ఉంది. ఈ పరిణామాలను ఊహించిన వైసీపీ అధిష్టానం చర్యలకు దిగింది. బుజ్జగింపులకు తెరదీసింది. నామినేటెడ్ పదవులు ఇస్తామని కూడా చెబుతోంది. అయినా పరిస్థితి మాత్రం ఇంకా గందరగోళంగానే ఉంది.













