ఈ మూడు జగన్ గెలవాల్సిందే…?
పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ తన సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలను అధికారపార్టీ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ముఖ్యంగా మూడు రాజధానులు అలాగే అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇపుడు వైసిపికి అనుకూలంగా ఉంటుందా లేదా అనేది చాలా వరకు చర్చనీయాంశంగా మారుతోంది.
అయితే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్ల పరిధిలో కచ్చితంగా వైసీపీ విజయం సాధించాలానే అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీని ఈ మూడు ప్రాంతాల్లోనే టార్గెట్ చేస్తూ వస్తోంది. విజయవాడలో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా విజయం సాధించవచ్చు అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి అనే విషయం కూడా ఇటీవల చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రచారంతో స్పష్టంగా అర్థమైంది.
గుంటూరు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన వచ్చిందని దీనిపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు గుంటూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందనే మాట వాస్తవం. అమరావతికి విజయవాడ గుంటూరు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వైసిపి ఓడిపోతే ఆ ప్రభావం ఇతర జిల్లాల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రచారం చేస్తోంది.
కార్పొరేషన్ల పరిధిలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందంటే మాత్రం కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నట్టు అర్ధమవుతుంది. విశాఖలో టీడీపీ విజయం సాధిస్తే మాత్రం ముఖ్యమంత్రి జగన్ కు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు రావచ్చు. రాజకీయంగా మూడు రాజధానులు అనే అంశం అధికార వైసిపికి అనుకూలంగా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు విశాఖ వైసీపీ ఓడిపోయింది అంటే మాత్రం మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తమకు రాజధాని వద్దు అని విశాఖ ప్రజలు స్పష్టంగా చెప్పినట్లు కూడా ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఇక్కడ కొన్ని వ్యూహాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు పార్టీ సీనియర్ నేతలు అందరూ కూడా ఇక్కడ సీరియస్ గా కష్టపడుతున్నారు.













