జగన్ పరీక్షలో 32 మంది ఎమ్మెల్యేలు ఫెయిల్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. తండ్రి వై.ఎస్. బాటలోనే సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్.. ఈసారి గత ఎన్నికలకు మించి సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నందున గత ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లకు మించి సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు. 175 స్థానాల్లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన పదే పదే పార్టీ నేతలకు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా మరోసారి ఇదే అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ లబ్ది జరిగిందని.. ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి చెప్పాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి ఇంటికీ మేలు జరిగినప్పుడు.. ఆ జరిగిన విషయాన్ని లబ్దిదారుల దృష్టికి తీసుకెళ్లి ఓట్లు అడగాలని జగన్ సూచిస్తున్నారు. ఈ ఏడాది మే 11న గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు నెలవారీగా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. తాజాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై మూడో సారి సమీక్ష నిర్వహించారు జగన్. ఈ సమీక్షలు పలు కీలక సూచలను చేశారు.
తాజాగా నిర్వహించిన సమీక్షలో 32 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ఎమ్మెల్యేలు పాల్గొనట్లేదని.. ఇది ప్రజా వ్యతిరేకతకు దారి తీస్తుందని స్పష్టం చేశారు. ప్రజాదరణే ప్రాతిపదికగా ఈసారి టికెట్లు ఇవ్వబోతున్నానని.. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే .. ఎన్నికల తర్వాత కూడా ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తుందని ఎమ్మెల్యేలను జగన్ హెచ్చరించారు. టికెట్లు రానప్పుడు బాధపడితే ఉపయోగం ఉండదని.. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి వారికి జరిగిన మేలును వివరించాలని స్పష్టం చేశారు. పదేపదే చెప్తున్నా ఇప్పటికీ 32 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదని రిపోర్టు వచ్చినట్లు జగన్ తెలియజేశారు. ఎవరెవరి పనితీరు ఏంటో జగన్ పేర్ల వారీగా వివరించారు. దీంతో ఎమ్మెల్యేలంతా కంగుతిన్నారు.
జనవరి 1 నుంచి పెరిగిన పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు జగన్ పార్టీ శ్రేణులకు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని.. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ప్రజాప్రతినిధులంతా ఇందులో పాల్గొనాలని స్పష్టం చేశారు. అంతేకాక.. ప్రతి సచివాలయంలో కనీరం ఆరు గంటలపాటు ప్రజాప్రతినిధులు ఉండాలని జగన్ ఆదేశించారు. గడపగడపకు మన ప్రభుత్వంపై తర్వాతి సమీక్ష మార్చి నెలలో ఉంటుందన్న సీఎం.. అప్పటివరకూ ప్రజాప్రతినిధులంతా పనితీరు మెరుగు పరుచుకోవాలని స్పష్టం చేశారు. అప్పటికీ పనితీరులో మార్పు రాకపోతే కఠిన నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు.













