సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చిన అవినాష్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత నెల 28న మొదటిసారి అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు దాదాపు నాలుగున్నర గంటలపాటు విచారించారు. అప్పట్లో విచారణలో కాల్‌డేటాపై దృష్టి సారించారు. అనంతరం సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌లను కడపకు పిలిపించి విచారించారు. ఇదే కేసులో నిందితుడైన సునీల్‌యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో సీబీఐ కౌంటరు దాఖలు చేస్తూ వివేకా హత్యకు పన్నిన కుట్ర గురించి సమగ్రంగా వెల్లడించిన తరుణంలో మరోమారు ఎంపీని విచారించనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అటు అవినాష్ విచారణ సందర్భంగా సీబీఐ కార్యాలయానికి వైసీపీ కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీగా తరలివచ్చారు.













