కడప గడప నుంచే నవరత్నాలకు శ్రీకారం : జగన్
కడప గడప నుంచి నవరత్నాల అమలుకు మరోసారి శ్రీకారం చుడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెల రోజుల లోపే వృద్ధాప్య పింఛనును రూ.2,250కు పెంచామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5.4లక్షల పింఛన్లు మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించారు. గత ప్రభుత్వం పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే తాము అదికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చేపట్టి కార్యక్రమాలను వివరించారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మీ తలుపు తట్టి పింఛను ఇస్తారు. అదే రోజు నుంచి గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఇంటికి వచ్చి వివరిస్తారు. గ్రామ వాలంటీర్లు ఎవరూ లంచం తీసుకోరు. ఎవరైనా లంచం తీసుకుంటే నేరుగా సీఎం కార్యాలయానికే ఫిర్యాదు చేయవచ్చు. ఇక నుంచి వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతాం. ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే ఉంది అని అన్నారు.













