అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అమలు
ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మరో కీలక హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమల్లోకి తీసుకువచ్చారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేసేలా సమగ్ర మార్గదర్శకాలతో కూడిన జీవోను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల, భవన నిర్మాణ కార్మికుల పేద అమ్మాయిల వివాహాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీ పేద అమ్మాయిల పెళ్లిళ్లకు వైఎస్సార్ షాదీ తోఫా అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లయ్యింది.
మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా అత్యంత పవిత్రంగా భావిస్తామని చెప్పడమే కాకుండా ఇచ్చిన మాట మేరకు ఆచరణలో అమలు చేసి చూపించారు. దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అంటే ఇలా ఉండాలని చాటి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం కొన్ని వర్గాలకే ప్రకటించి అమలు చేయకుండా కాగితాలకే పరిమితం అయిన పెళ్లి కానుకను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అర్హులైన వారందరికీ వర్తించేలా వైఎస్సార్ కళ్యాణ మస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను అమలోకి తెచ్చింది. పేద వర్గాల అమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన దాని కన్నా ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికంగా వివాహ నగదు బహుమతిని ఇస్తోంది.
ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98.44 శాతం అమలు చేసి.. సంక్షేమ అమలులో తన చిత్తశుద్ధి చూపించుకుంది వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. తాజాగా ఏపీలో మరో భారీ సంక్షేమ పథకానికి కసరత్తులు పూర్తి చేసింది. మరో కీలక హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అమలు చేయనుంది. బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మిక కుటుంబాలకు ఈ పథకం వర్తించనున్నాయి. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్ సర్కార్ అమలు చేయనుంది. అంతేకాదు.. ఈ పథకం కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు సాయం అందించనుంది.













