YS Family : ప్రజల ఆస్తిపై హక్కులకోసం పోట్లాడుకుంటున్న వైఎస్ ఫ్యామిలీ..!?
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ఫ్యామిలీ (YS Family) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటాలు ఇచ్చేది లేదంటూ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) NCLTని ఆశ్రయించడం సంచలనం కలిగిస్తోంది. మరోవైపు తాము కూడా చట్టప్రకారమే ముందుకెళ్తామని.. వెనక్కు తగ్గే ప్రశ్నే లేదని అటు షర్మిల, ఇటు విజయమ్మ (YS vijayamma) తేల్చి చెప్పడం మరింత ఆసక్తి రేపుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణం సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Saraswathi Power and Industries Limited). అసలు ఈ కంపెనీ చరిత్ర ఏంటి.. దీనికోసం వీళ్లు పోట్లాడుకోవడమేంటి.. అనే విషయాలు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరస్వతి పవర్ అండ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకు గుంటూరు (Guntur) జిల్లా దాచేపల్లి (Dachepalli) ఏరియాలో 1500లకు పైగా ఎకరాల భూమిని 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చారు. లీజు కూడా హెక్టారుకు రూ.400లకు మించలేదు. అప్పట్లో ఈ కంపెనీలో జగన్ కు కానీ, వైఎస్ కుటుంబానికి కానీ వాటాలు లేవు. ఆ తర్వాత రెండేళ్లకు ఈ కంపెనీలోకి జగన్ అండ్ కో ప్రవేశించింది. మెజారిటీ వాటాను దక్కించుకుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. సరస్వతి పవర్ కు వైఎస్ ప్రభుత్వం 2009లో భూమి కేటాయించినప్పుడు అసలు ఆ కంపెనీకి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనే ఆలోచనే లేదు. బోర్డు కూడా ఎలాంటి తీర్మానం చేయలేదు. అయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం రెండోసారి గెలిచిన తొలిరోజే ఈ ఫైలుపై సంతకం చేసేశారు.
ఈలోపు వైఎస్ చనిపోవడం, జగన్ సొంతపార్టీ పెట్టడం.. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ క్విడ్ ప్రో కో (quid pro quo) ద్వారా ఇలా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావడం.. వాటిపైన కేసులు నమోదు కావడం చకచకా జరిగిపోయాయి. ఇదే సమయంలో 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లవుతున్నా సరస్వతీ పవర్ కంపెనీ ప్రారంభించకపోవడంతో దానికి కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కు తీసేసుకుంది. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూములను మళ్లీ సరస్వతీ పవర్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. పైగా గతంలో కేటాయించినట్లు 30 ఏళ్లకు కాకుండా లీజును 50 ఏళ్లకు పొడిగించుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ తన సొంత కంపెనీకి దారాదత్తంగా భూములను కేటాయించుకున్నారన్నమాట.
ఇక వైఎస్ చనిపోవడంతో కుటుంబలో ఆస్తిపంపకాల గొడవ మొదలైంది. దీంతో ఈడీ (ED) క్లియరెన్స్ వచ్చాక ఆస్తుల్లో వాటాలను ఇచ్చేందుకు జగన్ 2019 ఆగస్టు 31న ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగానే సరస్వతీ పవర్ లో 48.99 శాతం వాటాలను గిఫ్ట్ డీడ్ పేరుతో తల్లి విజయమ్మకు కేటాయిస్తూ తీర్మానం చేసుకున్నారు. తల్లి నుంచి షర్మిలకు వెళ్లాలనేది ఈ తీర్మానం ఉద్దేశం. ఈ మేరకు సరస్వతి పవర్ యాజమాన్యానికి కూడా లేఖ రాశారు. దీంతో సరస్వతీ పవర్ యాజమాన్యం జగన్ చెప్పినట్లు తల్లి విజయమ్మకు 48.99 శాతం వాటాలను బదిలీ చేస్తూ ఈ ఏడాది జులై 9న నిర్ణయం తీసుకుంది. ఇది చూసి జగన్ షాక్ కు గురయ్యారు. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దు చేయాలని కోరుతూ NCLTని ఆశ్రయించారు. మరోవైపు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా దీనిపై న్యాయపోరాటానికే సిద్ధమయ్యారు.
అసలు సరస్వతీ పవర్ కంపెనీకి చెందిన భూములన్నీ ప్రభుత్వానివి. పైగా అక్రమాస్తులుగా భావించి కోర్టు వివాదాల్లో ఉన్నవి. వీటికోసం వైఎస్ కుటుంబం ఇప్పుడు తన్నుకుంటోంది. అంటే ప్రభుత్వ భూములను అనుభవించేందుకు వైఎస్ కుటుంబీకులు పోటీ పడుతున్నారన్నమాట.!













