విజయమ్మ వర్తమానం..!
వైఎస్ విజయలక్ష్మి.. మహానేత వైఎస్సార్ భార్య. ఆకుటుంబం నుంచి ఇద్దరు సీఎంలు అయ్యారు. అంతటి పవర్ ఫుల్ కుటుంబం నుంచి వచ్చిన విజయమ్మ.. తనకు తానుగా సజ్జల ఇంటికి ఎందుకు వెళ్లారు?.. తాను పిలిస్తే చేతులు కట్టుకుని వాలాల్సిన సజ్జలను ఇంటికి వెళ్లి కలవాలని విజయలక్ష్మి ఎందుకు భావించారు..? నేరుగా తనయుడికి చెప్పుకోలేక.. సజ్జల ద్వారా వర్తమానం అందించాల్సిన దుస్థితి దాపురించిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీతో విభేదించిన జగన్ కు వైఎస్ కుటుంబమంతా అండగా నిలిచింది. భర్త చాటు భార్యగా ఉండే విజయమ్మ నడిరోడ్డుపైకి వచ్చారు. తండ్రి లేని తన కుమారుడికి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందు కోసం రాజకీయ వేదికలను పంచుకున్నారు. అన్న వదిలిన బాణంగా షర్మిళ ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగారు. సోదరుడు జైల్లో ఉండగా పార్టీని కంటికిరెప్పలా కాపాడుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక కుటుంబసభ్యులు జగన్ కు బరువయ్యారు. బద్ధ విరోధులుగా మారిపోయారు. చివరికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టుకున్న సోదరికి వేధింపులు ఎదురైనా పలకరించలేని స్థితికి జగన్ చేరుకున్నారు. అయితే ఇంతటి గ్యాపునకు సజ్జల రామక్రిష్ణారెడ్డి లాంటి వారే కారణమన్న కామెంట్స్ వైసీపీ నుంచే వినిపిస్తుంటాయి.
ప్రస్తుతం వైసీపీలోనూ, ప్రభుత్వంలోనూ సజ్జల రామక్రిష్ణారెడ్డిది అత్యంత కీలక పాత్ర. ప్రభుత్వ ముఖ్య సలహాదారు. కానీ ఆయన ఏం చెబితే అది జగన్ చేస్తారని.. డీఫ్యాక్టో సీఎం అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం జగన్ కుటుంబసభ్యులు.. ముఖ్యంగా జగన్ తల్లి విజయమ్మ కూడా సజ్జలను ఆశ్రయించక తప్పని అనివార్య పరిస్థితి ఎదురవుతోంది. రహస్యంగా కలిసి సజ్జలకు ఏవో కుటుంబ విషయాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ మహానేత భార్యకు ఎదురైంది. కుమారుడికి నేరుగా చెప్పుకోలేని ఆమె స్థితి సగటు వైఎస్సార్ అభిమానులను కలచివేస్తోంది.
అమరావతి వచ్చిన విజయమ్మ… సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లడం ఆసక్తిగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి అధికార విధుల్లో సీఎం క్యాంప్ ఆఫీసులో బిజీగా ఉన్న సమయంలోనే… విజయమ్మ సజ్జల ఇంటికి వెళ్లారు. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నారు. ఆమెతో కొంతసేపు మాట్లాడి వెళ్లిపోయారు. అసలు విజయమ్మకు ఇలా సజ్జల ఇంటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. కబురు పెడితే వచ్చి మాట్లాడి వెళ్లాల్సిన స్థితి. అలాంటిది రహస్యంగా సజ్జల ఇంటికి వెళ్లి, పరిస్థితి వివరించాల్సిన దుస్థితి ఏర్పడింది.
కుటుంబం అన్నాక విబేధాలు సహజం. అయితే అటు కుమార్తె విషయంలో జరిగిన విషయాలు ఆమె మింగుడుపడలేదు. అందుకే తనకు తానుగా కుమారుడి నుంచి దూరమయ్యారు.. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి వైదొలిగారు. కానీ కుమారుడితో నేరుగా మాట్లాడే అవకాశమున్నా ఎందుకు ఆపని చేయడం లేదన్నదే ప్రశ్నే. అయితే పార్టీలో సైతం అధినేతకు నాయకులకు మధ్య ఒక లైన్ ఉంది. అదే సజ్జల రామక్రిష్ణారెడ్డి. అందుకే విజయమ్మ అంతటి వ్యక్తి…సజ్జల ఇంటికి వచ్చి మొర పెట్టుకోవాల్సి వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.













