YS Vijayamma: జగన్, షర్మిల మధ్యలో నలిగిపోతున్నా… విజయమ్మ ఆవేదన..!!

వైఎస్ కుటుంబంలో (YSR Family) విభేదాలున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan), వైఎస్ షర్మిల (YS Sharmila) మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు ఆ కుటుంబానికి ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా తల్లి విజయమ్మ, పిల్లలిద్దరి మధ్య నలిగిపోతున్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Saraswathi Power and Industries LtD) వాటాల బదలాయింపు వివాదం ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అంశంపై వైఎస్ విజయమ్మ (YS Vijayamma) తాజాగా నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్ (NCLT) చెన్నై బెంచ్‌లో అప్పీలు దాఖలు చేశారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజకీయ లబ్ధికి వినియోగించుకునే ప్రయత్నంగా ఆమె ఆరోపించారు. ఈ వివాదం కార్పొరేట్ సమస్య కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ కలహాల ఫలితమని విజయమ్మ స్పష్టం చేశారు.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1999లో విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లు, సరఫరా, నిల్వ, పంపిణీ కోసం స్థాపించారు. దీనికి గుంటూరులో 903.28 ఎకరాల భూమి ఉంది. వాటాల బదలాయింపుకు ముందు విజయమ్మకు 48.99%, జగన్‌కు 29.88%, భారతీరెడ్డికి 16.30%, క్లాసిక్ రియాల్టీకి 4.83% వాటాలు ఉన్నాయి. 2021 జులై 26న జగన్ 74.26 లక్షలు, భారతీరెడ్డి 40.50 లక్షల వాటాలను విజయమ్మకు గిఫ్ట్ డీడ్‌ల రూపంలో బదలాయించారు. అదే సమయంలో విజయమ్మ క్లాసిక్ రియాల్టీ నుంచి రూ.3.07 కోట్లకు 11.38 లక్షల వాటాలను కొనుగోలు చేశారు. ఈ లావాదేవీల తర్వాత జగన్ 2021 ఆగస్టు 14న సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. సరస్వతి పవర్ బోర్డు 2024 జులై 2న వాటాల బదలాయింపును ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ఇందులో విజయమ్మ, జనార్దన్‌రెడ్డి పేర్లతో వాటాలను నమోదు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీ హైదరాబాద్ NCLTలో పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద దాఖలైన ఈ పిటిషన్‌లో వాటాల బదలాయింపును రద్దు చేయాలని, తమ పేర్లను పునరుద్ధరించాలని కోరారు. హైదరాబాద్ NCLT జులై 29న జగన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్ NCLT తీర్పును చట్టవిరుద్ధమని, దాని అమలును నిలిపివేయాలని కోరుతూ విజయమ్మ చెన్నై NCLTలో అప్పీలు దాఖలు చేశారు. ఆమె తరఫున న్యాయవాది ఎం.మహర్షి విశ్వరాజ్ ఈ అప్పీల్‌ను సమర్పించారు. సరస్వతి పవర్ సంస్థ కూడా ఈ అప్పీల్‌తో పాటు పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు త్వరలో చెన్నై అప్పీలెట్ బెంచ్‌లో విచారణకు రానుంది.
తన అప్పీల్‌లో విజయమ్మ పలు కీలక అంశాలను పేర్కొన్నారు. జగన్ పిటిషన్ కార్పొరేట్ వివాదం కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ కలహాల ఫలితమని ఆరోపించారు. ఈ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి రాజకీయ మైలేజీ పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని వాపోయారు. 2021లో జగన్, భారతీరెడ్డి తమ వాటాలను ప్రేమతో గిఫ్ట్ గా ఇచ్చారని, ఇది కుటుంబ ఒప్పందంలో భాగమని, చట్టప్రకారం దీనికి ప్రాధాన్యం ఉంటుందని వాదించారు. ఈ గిఫ్ట్ డీడ్‌లను సివిల్ కోర్టులో సవాల్ చేయలేదని, కాబట్టి ఎన్‌సీఎల్‌టీలో ప్రశ్నించడం సరికాదని పేర్కొన్నారు. క్లాసిక్ రియాల్టీ నుంచి రూ.3.07 కోట్లకు వాటాలను కొనుగోలు చేశానని, ఈ లావాదేవీ చట్టబద్ధమని స్పష్టం చేశారు. హైదరాబాద్ NCLT తీర్పు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిందన్నారు. గిఫ్ట్ డీడ్‌లు, వాటా కొనుగోలు ఒప్పందాలను విస్మరించిందని విమర్శించారు. ట్రైబ్యునల్ కేవలం సభ్యుల రిజిస్టర్‌లో పేర్ల నమోదు తప్పుగా జరిగినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాలని, స్వచ్ఛందంగా బదలాయించిన వాటాలపై జోక్యం సరికాదని వాదించారు. NCLT ఉత్తర్వులను అమలు చేస్తే 99.75% వాటాలు అస్థిరమవుతాయని, కంపెనీ నిర్వహణ దెబ్బతింటుందని, థర్డ్ పార్టీ హక్కులపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. యథాతథ స్థితి కొనసాగిస్తే జగన్, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలకు నష్టం ఉండదని, కానీ తనకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
విజయమ్మ తన అప్పీల్‌లో జగన్, షర్మిల మధ్య రాజకీయ విభేదాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వివాదం కేవలం కార్పొరేట్ సమస్య కాదని, కుటుంబంలోని రాజకీయ విభజన నుంచి పుట్టుకొచ్చిందని ఆరోపించారు. జగన్ తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, అక్రమ లబ్ధి పొందేందుకు ఈ పిటిషన్‌ను వినియోగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంలో చిక్కుకున్న తాను ఇద్దరు పిల్లల తల్లిగా మధ్యలో నలిగిపోతున్నానని వాపోయారు. విజయమ్మ దాఖలు చేసిన అప్పీల్‌పై చెన్నై NCLT తీర్పు ఈ వివాదంలో కీలకం కానుంది. ఈ కేసు కార్పొరేట్ చట్టం, కుటుంబ ఒప్పందాలు, రాజకీయ లాభాల మధ్య సంక్లిష్ట సమస్యగా మారింది.