వైసీపీకి విజయమ్మ రాజీనామా… ప్లీనరీ వేదికగా ప్రకటన
వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ వేదికగా ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై తన కుమార్తె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ తెలిపారు. మా కుటుంబంతో ప్రజల అనుబంధం 45 ఏళ్లగా కొనసాగుతోంది. వైఎస్ ప్రతి మనిషీని ప్రేమించారు. మేం కష్టాల్లో ఉన్నడు ప్రజలే మమ్మల్సి ఓదార్చారు. మా కుటుంబ అనుబంధం, సంస్కారం గొప్పవి. సంక్షేమం, అభివృద్ధి జగన్కు రెండు కళ్లు. అభివృద్ధి అంటే ప్రజల జీవన శైలిని పెంచడమే జగన్ పాలనలో ప్రతి ఇంటికీ ఆదాయం, ఆహారం, ఇల్లు విద్య, వైద్యం అందుతున్నాయన్నారు.
నాన్న ఆశయాల సాధనకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది. నా కొడుకు జగన్ను మీ చేతుల్లో పెడుతున్నానని మరోసారి చెబుతున్నా. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకుతో ఉన్నా. సంతోషంగా ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే షర్మిలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. రెండు రాష్ట్రాల్లో విమర్శలకు తావు లేకుండా ఉండేందుకు రాజీనామా చేస్తున్నా. పార్టీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా. ఈ విషయంలో నన్ను అందరూ క్షమించాలని అని విజయమ్మ అన్నారు.













