షర్మిల వెంటే విజయమ్మ..
కడప ఎంపీ స్థానం విషయంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ కంచుకోట లాంటి కడప నుంచి ఎంపీఅభ్యర్థిగా అవినాష్ రెడ్డి ఇప్పటికే బరిలో నిలిచారు. తన గెలుపు ఖాయమని తలిచారు కూడా. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలో నిలిచారో అప్పటినుంచి అవినాష్ రెడ్డికి కష్టకాలం దాపురించింది. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి ప్రమేయముందంటూ షర్మిల ప్రచారాన్ని ఉధృతం చేశారు.దీనికి తోడు షర్మిల వెంటే సునీత, వివేకా భార్య సౌభాగ్యమ్మ నిలిచారు. అయినా తట్టుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు అవినాష్ రెడ్డి. ఎందుకంటే .. సీఎం జగన్ అండ ఉందని.. కచ్చితంగా గెలుస్తానని భావించారు. అయితే పోలింగ్ కు కొన్ని గంటలముందు అవినాష్ రెడ్డి, సీఎం జగన్ కు గట్టి షాక్ తగిలింది.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ.. నేరుగా నియోజకవర్గ ప్రజలకు సందేశమిచ్చారు. తన బిడ్డ షర్మిలను కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయమ్మవీడియో పోస్టు కావడంతో వైసీపీలో కలకలం రేపుతోంది. ఇప్పుడు అసెంబ్లీకి జగన్ కు, ఎంపీ స్థానానికి షర్మిలకు ఓటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే అవినాష్ రెడ్డి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.మరోవైపు.. సాక్షాత్తూ విజయమ్మే అభ్యర్థించడంతో .. వైఎస్ అభిమానులు, జిల్లాప్రజల్లోనూ చీలిక వచ్చినట్లు సమాచారం.
మొన్నటివరకూ షర్మిల విమర్శలు చేస్తే.. దానికి వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. అంతేకాదు.. నేరుగా సీఎం జగన్ సైతం .. షర్మిల రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదంటూ కామెంట్ చేశారు. దానికి షర్మిలకూడా అంతేస్థాయిలో బదులిచ్చారు. పెళ్లి చేసుకుని కుటుంబజీవితం గడుపుతున్న తననురాజకీయాల్లోకి తెచ్చింది మీరు కాదా అని జగన్ కు కౌంటరిచ్చారు. అంతేకాదు.. మీడియా సమావేశంలోనే కంటతడిపెట్టుకున్నారు.
ఇప్పుడేమో విజయమ్మ.. షర్మిలకు మద్దతుగా పోస్ట్ చేశారు.దీన్ని అధికార పార్టీ ఎలా చూస్తుంది. విజయమ్మను విమర్శించే పరిస్థితి ఉంటుందా..? ఓవేళ అలా అని తొందరపడితే మొదటికే మోసం వచ్చే పరిస్థితిఉంది. ఓవేళ విజయమ్మ అభ్యర్థించినా షర్మిల గెలవకుంటే.. వైెఎస్ ఫ్యామిలీ అభిమానుల సంగతి ప్రశ్నార్థకంగా మారనుంది. మరి దీన్ని అధికార వైసీపీ పార్టీ ఎలా తీసుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.













