Phone Tapping: విజయమ్మ కూడా బాధితురాలే..? తేల్చేసిన సిట్

తెలంగాణ ఫోన్ టాపింగ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా అనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. క్రమంగా ఇది భారత రాష్ట్ర సమితిని రాజకీయంగా అంతం చేసే అవకాశం కూడా ఉందనే సంచలన అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంటర్ కావడంతో దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉందని వార్తలు సైతం వినిపించాయి. తెలంగాణ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు ప్రముఖులు కూడా ఉన్నారనే ప్రచారం జరిగింది.
ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) అలాగే ఆమె భర్త అనిల్ కుమార్ ఇందులో బాధితులని వార్తలు వచ్చాయి. దీనిపై షర్మిల కూడా తీవ్రంగానే వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు వైయస్ విజయమ్మ ఫోన్ కూడా టాపింగ్ కు గురైనట్లు ఓ వార్త బయటకు వచ్చింది. వైయస్ జగన్ తో షర్మిల విభేదించిన తర్వాత విజయమ్మ షర్మిలకు అండగా నిలిచారు. అప్పటినుంచి ఆమె వైసీపీకి రాజీనామా చేయడమే కాకుండా జగన్ వద్దకు రావడానికి కూడా ఇష్టపడలేదు. దీనితో జగన్(YS Jagan) ఇద్దరిపై సీరియస్ గా ఉన్నారని ప్రచారం జరిగింది.
ఆ తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు. షర్మిల ఫోన్ తో పాటుగా విజయమ్మ ఫోన్ కూడా ఒకే సమయంలో టాపింగ్ కు గురైనట్లు అధికారులు తేల్చారు. త్వరలోనే వైయస్ విజయమ్మకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆమెతోపాటుగా వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఫోన్ కూడా అదే సమయంలో టాపింగ్ గురైనట్లు గుర్తించారు అధికారులు. త్వరలోనే వైయస్ షర్మిలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
విజయమ్మ ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక వైసీపీ కీలక నేతతో ఆ పార్టీ అధిష్టానానికి పంపించారని గుర్తించినట్లు రెండు రోజుల నుంచి గట్టిగా వార్తలు వినపడుతున్నాయి. దీనితో విజయమ్మను కూడా విచారించే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే కడప జిల్లాకు చెందిన టిడిపి నేత బీటెక్ రవి ఫోన్ కూడా టాప్ అయినట్లు తేల్చారు.