వై.ఎస్.వివేకా హత్యపై ఘాటుగా స్పందించిన విజయమ్మ
తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివేకా హత్యకేసును లేవనెత్తారు. అంతకుముందు వివేకా కుమార్తె సునీత ఢిల్లీ వెళ్లి వివేకా హత్య కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. ఓ దివంగత ముఖ్యమంత్రి సోదరుడు, మరో ముఖ్యమంత్రి బాబాయే దారుణంగా హత్యకు గురైతే ఆ కేసును రెండేళ్లయినా తేల్చట్లేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఢిల్లీ వచ్చి సీబీఐ అధికారులను కలిసినట్లు ఆమె వివరించారు. కేసును త్వరగా తేల్చి దోషులకు శిక్ష వేయాలని ఆమె డిమాండ్ చేశారు.
సునీత లేవనెత్తిన అంశాలను తిరుపతి ఉపఎన్నికలో ప్రచారానికి వాడుకుంటున్నాయి పార్టీలు. అటు జనసేన, బీజేపీ, ఇటు తెలుగుదేశం కూడా వివేకా హత్యకేసును అజెండాగా తీసుకున్నాయి. సొంత బాబాయ్ హత్య వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని.. అందుకే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వివేకా హత్య కేసును నిజంగా తేల్చాలనుకుంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎంతో సమయం పట్టదనేది టీడీపీ నేతల వాదన. సునీత వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయని.. జగన్ ను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందని సునీత ఆవేదన వ్యక్తం చేసిందని టీడీపీ నేతలు చెప్తున్నారు. సునీతకు న్యాయం చేయాలంటే వివేకా హత్య కేసును త్వరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వివేకా హత్యకేసు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలో ఉన్న జగన్.. బాబాయ్ హత్యకేసును పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. అధికారంలో ఉన్న పార్టీకి ఓ కేసు విచారణ పూర్తి చేయడానికి రెండేళ్లు కావాలా.. అని ప్రశ్నించారు. అయితే పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. కేసు కేంద్రం పరిధిలో ఉందని.. సీబీఐ విచారణ జరుపుతున్నప్పడు రాష్ట్రం ఏం చేయగలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఏ కేసు విచారణ ఎవరు చేస్తున్నారో.. ఎవరి పరిధి ఏంటో తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ మాట్లాడారని ఎద్దేవా చేశారు.
ఇదే అంశంపై వై.ఎస్. విజయమ్మ ఘాటుగా స్పందించారు. తన మరిది వివేకానంద రెడ్డి హత్య కేసును నిగ్గు తేల్చాలనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ఇదే తన మాట, జగన్ మాట, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. హత్యపై కొందరు అవాస్తవాలు మాట్లాడుతున్నారని.. కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసుపై తామందరం ఒకే మాట మీద ఉన్నామన్నారు. సునీత డిమాండ్లకు తాము కూడా కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.













