అన్న ఓటమే లక్ష్యమంటున్న ‘చెల్లెల్లు’..
సీఎం జగన్ రాజకీయంగా శక్తిమంతమైన నేత. ఆ విషయాన్ని ఏపీలో ఎవరిని అడిగినా చెబుతారు. కానీ అదే సమయంలో ఎవరేం చెప్పిన వినడు. ఆలకించడు.. ఆయన వ్యూహాల ప్రకారమే నడుస్తాడని వైసీపీ సీనియర్లు, క్యాడర్ ఆఫ్ దటాక్ గా చెప్పేమాట. చెల్లెల్ల విషయంలో కూడా ఆయన మొండిగానే ఉన్నారు. జగనన్న బాణాన్ని అని స్వయంగా ప్రకటించుకుని జైల్లో ఉన్నప్పుడు, ఆయన తరపున విస్తృత ప్రచారం చేసిన వైఎస్ షర్మిలను పక్కన పెట్టారు. ఆవిడ ఏదో పదవి ఆశించిందంటారు. అయితే ఆ పదవి దక్కలేదు. సరికదా.. ఆస్తుల విషయంలోనూ తనకు న్యాయం జరగలేదన్న బాధ షర్మిలలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇక కుదరదని.. పక్కనే ఉన్న తెలంగాణలో పార్టీ పెట్టి, కొన్ని నెలలు నడిపించారు. ఆతర్వాత పెద్దగా ప్రయోజనం కనిపించక కాంగ్రెస్ లో విలీనం చేశారు.
ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలిగా మారిన షర్మిల.. జగన్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు. అవినీతి నుంచి వైఎస్ వారసత్వం వరకూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీంతో సొంత చెల్లే నేరుగా ప్రశ్నించడం జగన్ అభిమానులు, కార్యకర్తల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు.. వైఎస్ వివేకా హత్యకేసులో న్యాయపోరాటం చేస్తున్న సునీతారెడ్డికి మద్దతుగా నిలిచింది. సీబీఐ విచారణకు సైతం హాజరైంది. ఇప్పుడు నేరుగా సీఎం జగన్ పార్టీతో తలపడుతోంది. ఆపార్టీ గెలవకుండా చేయాలని శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది.
ఇక..వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను కాపాడుతున్నారంటూ ఇప్పటివరకూ పరోక్షంగా సీఎం జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన వైఎస్ సునీత… ఎన్నికల ముందు నేరుగానే విమర్శలు చేశారు. తన సోదరుడు జగన్‌కి, అయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని కోరారు. తన అనుకునే వాళ్లకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు. సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుంది.‘‘వివేకా హత్యకేసును ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతు తీర్పు నాకు కావాలి. సీబీఐ దర్యాప్తునకు వెళదామని అప్పట్లో జగన్‌ని అడిగా. సీబీఐ దర్యాప్తునకు వెళ్తే అవినాశ్ బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారు.
అయినా సరే.. నేను సీబీఐకి ఫిర్యాదు చేశా. ఆ తర్వాత నాతోపాటు నా భర్తకు వేధింపులు ఎదురయ్యాయి. సీబీఐ పైన కూడా కేసులు పెట్టడం మొదలు పెట్టారు. కేసు విచారణ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. మా నాన్న హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది. వారిద్దరిని జగన్ రక్షిస్తున్నారు. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. జగన్ కేసులు అవుతున్న విధంగానే ఈ కేసు డ్రాగ్ అవడం నాకు ఇష్టం లేదు. సీబీఐకి ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలియదు’’ అని సునీత పేర్కొన్నారు.
గొడ్డలితో నరికారని జగన్ కు ఎలా తెలుసు?
‘‘షర్మిల ఒక్కరే నాకు మొదటి నుంచి అండగా నిలిచారు. 700 మందిపైగా కుటుంబ సభ్యులు ఉన్నారు, కానీ, నాకు అండగా ఎవరూ ముందుకు రాలేదు. నాన్న హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలి. గొడ్డలితో నరికి చంపారు అనే విషయం ఆయనకి ఎలా తెలుసు? అన్న విషయం బయటికి రావాలి. జగన్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపారు అని చెప్పారు.. అదెలా తెలిసింది ? నేను ఇంకా పోరాటం చేస్తాను. ప్రజలు నాది న్యాయమైన పోరాటం అని గుర్తిస్తే వారు జగన్‌కు ఓటు వేయరు. ఇలాంటి క్రైం కనిపించొద్దంటే ప్రజలంతా ముందుకు రావాలి. అప్పుడే ….ప్రభుత్వం ప్రభావం కనిపిస్తుంది అందుకే కేసు ముందుకు వెళ్ళడం లేదు’’ అని పేర్కొన్నారు.













