కాంగ్రెస్ ‘ప్రత్యేకహోదా’ పోరాటం..
ఏపీలో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముందుగా షర్మిలకు వైసీపీ ఏపీ అధ్యక్షురాలిగా నియమించిన కాంగ్రెస్ హైకమాండ్.. ఆమెకు పూర్తిస్వేచ్చ ఇచ్చినట్లు తెలుస్తోంది. విభజన గాయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఏపీకి..తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.
దీంతో షర్మిల.. ప్రత్యేకహోదా గోదాలోకి దూకారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ చెబుతోంది. హోదాకు బదులు ప్రత్యేకప్యాకేజీవైపు మొగ్గుచూపిన టీడీపీ, మనకు బలం లేదు.. అందుకే ఏం చేయలేకపోతున్నామని అంటున్న వైసీపీకి షాకిస్తూ..కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశాన్ని తలకెత్తుకుంది. ఇప్పుడు ప్రజలు తమను నమ్మాలంటే.. కచ్చితంగా పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలకు తెలుసు. అందుకే ఢిల్లీ వేదికగా షర్మిల ప్రత్యేకహోదా కోసం దీక్ష చేశారు.
హోదా పోరాటంలో భాగంగా దేశవ్యాప్త మద్దతు కోసం జాతీయనేతలను కలుస్తున్నారు. ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన హామీల అంశాలను పవార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిని కూడా కలిసి మద్దతు కోరారు. వారు అంగీకరించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రత్యేకహోదా నినాదాన్ని తలకెత్తుకోవడం.. ఏపీలో ప్రధాన పార్టీలకు సమస్యాత్మకంగా మారింది. ప్రజలు ఒకవేళ మళ్లీ ప్రత్యేకపోరుపై ఆసక్తి కనబరిస్తే.. తప్పకుండా మిగిలిన పార్టీలు ఫైట్‌లోకి రావాల్సి ఉంటుంది. దీంతో కేంద్రంతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అన్న భయం కూడా ఆయాపార్టీల అధినేతలను ఆలోచింప చేస్తోంది.













