కడప బరిలో షర్మిల..! అవినాశ్ రెడ్డికి ఇబ్బందులు తప్పవా..?
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గాల్లో కడప పార్లమెంటు ఒకటి. ఇది వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. ప్రతిసారి ఇక్కడ ఆ కుటుంబీకులే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా వాళ్లే బరిలో ఉంటున్నారు.. అయితే ఒక్కరు కాదు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు పోటీ పడుతున్నారు. వైఎస్ అవినాశ్ రెడ్డిపై వైఎస్ షర్మిల పోటీ పడబోతున్నట్టు తాజా సమాచారం. అందుకే ఈ నియోజకవర్గం అత్యంత హాట్ టాపిక్ గా మారింది.
కడప పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకూ 18 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 10 సార్లు వైఎస్ కుటుంబీకులే విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 4 సార్లు, వైఎస్ వివేకానంద రెడ్డి 2 సార్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు, వైఎస్ అవినాశ్ రెడ్డి 2 సార్లు గెలుపొందారు. 1989 నుంచి ఇక్కడ వైఎస్ కుటుంబీకులదే విజయం. దీన్ని బట్టి కడప పార్లమెంటు స్థానం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా వైసీపీ నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. టీడీపీ కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది.
సోదరుడు జగన్మోహన్ రెడ్డితో వైఎస్ షర్మిల విభేదించి బయటకు వచ్చారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలనేది హైకమాండ్ ఆలోచన. అందుకు వైఎస్ షర్మిల అయితేనే బాగుంటుందని ఆలోచిస్తోంది. కడప ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. దానికి వైఎస్ ఫ్యామిలీ అండగా ఉండేది. ఇప్పుడు షర్మిల కూడా వైఎస్ ఫ్యామిలీ బిడ్డే కాబట్టి కడప నుంచి ఆమె పోటీ చేస్తేనే బాగుంటుందని రాహుల్, సోనియా భావించినట్టు సమాచారం. అందుకే షర్మిలను ఎన్నికల బరిలోకి దింపుతున్నారు.
జగన్ తనకు రావల్సినవి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని షర్మిల బాధపడుతున్నారు. తల్లి విజయమ్మ కూడా జగన్ ను కాదని షర్మిలకు అండగా నిలుస్తున్నారు. సొంత చెల్లినే జగన్ ఇబ్బంది పెడుతున్నారని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. మరోవైపు వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఆయన్ను జగన్ వెనకేసుకొస్తున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో వివేకా కుమార్తె వైఎస్ సునీతకు వైఎస్ షర్మిల మద్దతుగా ఉంటున్నారు. వివేకా హత్యపై కడప జిల్లాలో ఆయన కుటుంబంపై సింపతీ ఉంది. ఆడబిడ్డలను వేధిస్తున్నారనే టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పోటీ చేస్తే వైఎస్ అభిమానుల ఆదరణ పొందవచ్చనేది కాంగ్రెస్ ఆలోచన. అందుకే షర్మిలను కడప నుంచి పోటీ చేయించడం దాదాపు ఖాయమైనట్టు సమాచారం. మరి కుటుంబ పోరులో ఎవరు నెగ్గుతారో వేచి చూడాలి..!













