YS Raja Reddy: వైఎస్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు..!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వైఎస్ కుటుంబానికి (YS Family) ఎంతో ప్రత్యేకత ఉంది. దశాబ్దాలుగా ఆ కుటుంబం రాజకీయాల్లో తనదైన ముద్ర వేయగలిగింది. రాజారెడ్డి (YS Raja Reddy) మొదలు రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy), జగన్మోహన్ రెడ్డి (YS Jagan), వివేకానంద రెడ్డి (YS Viveka), విజయమ్మ (YS Vijayamma), షర్మిల (YS Sharmila).. ఇలా ఎంతోమంది రాజకీయాల్లో తమ ముద్ర వేయగలిగారు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనే వైఎస్ రాజారెడ్డి (YS Raja Reddy). ఇతను వైఎస్ షర్మిల తనయుడు. త్వరలోనే ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు వార్తలు అందుతున్నాయి.
వైఎస్ కుటుంబంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సోదరుడితో వైఎస్ షర్మిల దూరంగా ఉంటున్నారు. వైసీపీ పెట్టినప్పుడు అన్న వదిలిన బాణాన్ని అంటూ ఆయన కోసం, పార్టీ కోసం షర్మిల పని చేశారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు పాదయాత్ర చేసి పార్టీని కాపాడారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక షర్మిలను పక్కన పెట్టారు. అదే సమయంలో ఆస్తి పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో షర్మిల ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు. అక్కడ వర్కవుట్ కాకపోవడంతో దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అన్నపై పోరుబాట సాగిస్తున్నారు.
వైసీపీలో తమకు స్థానం లేదని నిర్ణయించుకున్న షర్మిల కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో ఉల్లి పంటకు మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కర్నూలులో ఓ కార్యక్రమం చేపట్టింది. ఇందులో షర్మిలతో పాటు ఆయన కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూలు బయలుదేరి వెళ్లారు.
వైఎస్ కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదు. అయితే ఇన్నేళ్లూ కుటుంబమంతా ఒక్కతాటిపై నిలిచి ఉండేది. అయితే కొన్నేళ్లుగా జగన్, షర్మిల వేర్వేరు మార్గాలు ఎంచుకున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కడప నుంచి షర్మిల కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో కుమారుడిని పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంటు నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్టు తెలుస్తోంది. తన వారసుడిగా రాజకీయాల్లో కుమారుడు కీలక పాత్ర పోషించాలని ఆమె అనుకుంటున్నట్టు సమాచారం. అందుకో ఇకపై రాజకీయాల్లో రాజారెడ్డి కూడా యాక్టివ్ రోల్ పోషించనున్నారని, త్వరలోనే అధికారికంగా రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయనున్నారని సమాచారం.