Y.S.Sharmila: మోడీ పర్యటనకు ముందు షర్మిల హౌస్ అరెస్ట్..

ఏపీ కాంగ్రెస్ పార్టీ (Andhra Pradesh) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)ను రాష్ట్ర పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమె ఇంటి నుంచి బయటకు రాగానే అరెస్టు చేయాల్సి వస్తుందని విజయవాడ (Vijayawada) పోలీసులు ఆమెకు ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. దీంతో షర్మిల ఇంటిలోనే ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, షర్మిల ఈ రోజు అమరావతిలో (Amaravati) పర్యటించాల్సి ఉండగా, అధికారులు ఆమె ప్రయాణాన్ని అడ్డుకున్నారు.
మే 2న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత రైతులకు (farmers) న్యాయం జరగలేదని పేర్కొంటూ, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని షర్మిల యోచించారు. ఈ నేపథ్యంలో గుంటూరు (Guntur) జిల్లాలోని ఉద్దండరాయునిపాలెంలో (Uddandarayunipalem) రైతులతో భేటీ కావాలని షెడ్యూల్ రూపొందించారు. మోడీ అమరావతి పర్యటనకు ముందు అక్కడి రైతుల సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆమె ఈ పర్యటనను ఏర్పాటు చేశారు.
షర్మిల ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమె నివాసానికి వెళ్లిన అధికారులు, విజయవాడలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని ,అందుకే ప్రస్తుతం ఏ విధమైన ర్యాలీలు, సమావేశాలకు అనుమతులు లేవని తెలిపారు. కానీ షర్మిల మాత్రం, తాను విజయవాడలో కాదు, రైతులతో చర్చించేందుకు మాత్రమే వెళ్తున్నానని చెప్పి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆమె ఇంటి నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేసిన పోలీసులు, షర్మిలకు అధికారికంగా నోటీసులు అందించారు. అంతేకాకుండా ఆమె ఇంటి వద్ద 12 మందితో కూడిన పోలీసు బృందాన్ని మోహరించారు. ఈ నేపథ్యంలో షర్మిల ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక షర్మిల పిలుపుతో విజయవాడకు వచ్చిన కాంగ్రెస్ నాయకులను (Congress leaders) కూడా పోలీసులు నిలిపివేశారు. వారి ప్రయాణాన్ని అడ్డుకొని, ప్రాంతం విడిచి వెళ్లాలని సూచించారు. ఇది పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రైతుల పక్షాన పోరాటం చేయాలన్న షర్మిల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నందుకు పార్టీ వర్గాలు నిరసన తెలియజేస్తున్నాయి.