చలో సెక్రటేరియట్ లో ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల అరెస్టు
మెగా డీఎస్పీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు తొలుత కార్యకర్తలు, నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల కారు దిగగానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసి వాహనం ఎక్కించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్త్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.













