ఏపీ ప్రత్యేక హోదాపై షర్మిల ఎమోషనల్ స్టేట్మెంట్..
ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ వైయస్ షర్మిల ఎమోషనల్ అయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెట్టలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. కొందరు తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారని తాను నిజంగా వ్యక్తిగత కారణాలవల్ల రావాలి అనుకుంటే 2019లోనే ఇక్కడ అడుగు పెట్టే దాన్ని అని ఆమె అన్నారు. మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ పోరాడకపోతే ఎప్పటికీ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని షర్మిల పేర్కొన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఊపిరి లాంటిది అన్న షర్మిల ఈ విషయంలో తల్లి లాంటి ఆంధ్రకు జగన్ వెన్నుపోటు పొడిచాడు అని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ధర్నాలు చేశారు..దీక్షలు చేశారు.. మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని పిలుపునిచ్చారు. తీరా సీఎం అయ్యాక అన్ని మర్చిపోయారు. ఒక్కటైన నిజమైన పోరాటం చేశారా వీళ్ళు? అని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అనేది మన బిడ్డల హక్కు.. దీని గురించి అసలు పట్టించుకున్నారా? ప్రత్యేక హోదా మనకు వచ్చినట్లయితే రాజధాని, పోలవరం మనమే కట్టుకునే వాళ్ళం కదా.. అని షర్మిల జగన్ పాలనపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో బాగా ఎమోషనల్ అయిన షర్మిల కంటతడి కూడా పెట్టుకున్నారు.













