జగన్ ను ఆడేసుకుంటున్న షర్మిల…
ఢిల్లీ ధర్నాలో తమకు ఇండియాకూటమిలోని కొన్నిపార్టీలు మద్దతిచ్చాయని.. కాని కాంగ్రెస్ నేతలు రాలేదంటూ జగన్ విమర్శించారు. అంతేకాదు… వయా రేవంత్ రెడ్డి, చంద్రబాబు.. కాంగ్రెస్ కు ఎలా దగ్గరగా ఉన్నారో అంటూ నేషనల్ మీడియా సాక్షిగా ఆరోపణలు గుప్పించారు. అయితే దీనికి కాంగ్రెస్ కూడా ఘాటుగానే బదులిస్తోంది. ఆయితే జాతీయస్థాయిలో కాదు… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, సోదరి షర్మిల.. జగన్ ను నేరుగానే విమర్శించారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు షర్మిల. సిగ్గు సిగ్గు….. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనబడదు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు. కానీ.. మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం.. ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనమన్నారు షర్మిల. MLA అంటే మెంబరాఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంతే కానీ మెంబరాఫ్ మీడియా అసెంబ్లీ కాదన్న విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు.
ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా? మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? ఐదేళ్ల పాలనంతా అవినీతి, దోపిడీ.. రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. మీరు మాత్రం ప్యాలెస్లో తాపీగా కూర్చుని మీడియా మీట్లు పెడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది ఇందుకు కాదు. మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా?అసెంబ్లీకి పోనని చెప్పే మీరు.. ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అనర్హులు. వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు షర్మిల.
బడికి పోను అనే విద్యార్థికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి తీసేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లనపుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో.. అంటార్కిటికా మంచులోకే పోతారో ఎవరికి కావాలి? అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ చీఫ్ డిమాండ్ చేశారు.













