చంద్రబాబు సర్కార్ పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు..!
ఏపీలో.. మొక్కజొన్న పండించే అన్నదాతల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, వారి శ్రమ అంతా దళారుల పాలవుతోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి(Ys Sharmila) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో(Vijayawada) మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర కేవలం కాగితాలకే పరిమితమైందని, ఆచరణలో రైతుకు రూపాయి కూడా అదనంగా అందడం లేదని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ. 2400 మద్దతు ధర నిర్ణయిస్తే, బహిరంగ మార్కెట్లో దళారులు కేవలం రూ. 1500లకే రైతులను దోచుకుంటున్నారని, క్వింటాకు రూ. 900 వరకు నష్టం జరుగుతుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు రైతు సంక్షేమం గురించి భారీ హామీలు ఇచ్చారని, కానీ నేడు ఆచరణలో అవి శూన్యంగా మిగిలాయని షర్మిల విమర్శించారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ఏర్పడే లోటును ప్రభుత్వమే భర్తీ చేస్తుందని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆమె నిలదీశారు.
ఇవి కూడా చదవండి
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ మరియు ప్రత్యేక ప్రైస్ డెపిషియన్సీ పేమెంట్ (PDP) పథకాలు పూర్తిగా పడకేశాయని, రెండేళ్ల కూటమి పాలన రాష్ట్ర రైతాంగానికి నిజంగా ఒక పెనుశాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండిస్తే, ధర లేక దారుణమైన మోసానికి గురవుతున్నారని, ఇదేనా కూటమి ప్రభుత్వం చెబుతున్న రైతు సంక్షేమ ధ్యేయం అని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి అద్భుతంగా ఉన్నప్పటికీ, అది రైతులకు సంతోషాన్ని కాకుండా కన్నీళ్లను మిగిల్చిందని షర్మిల పేర్కొన్నారు.
గణాంకాల ప్రకారం 4.83 లక్షల హెక్టార్లలో దాదాపు 37.61 లక్షల మెట్రిక్ టన్నుల పంట చేతికొచ్చిందని, కానీ గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులకు ఎకరాకు సగటున రూ. 25 వేల వరకు నష్టం వాటిల్లుతోందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న రైతులు దాదాపు రూ. 3 వేల కోట్లు నష్టపోతున్నారని, ఈ నష్టాన్ని ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) తక్షణమే స్పందించి, ధరలో ఏర్పడిన లోటును రైతులకు నేరుగా చెల్లించాలని, తద్వారా అన్నదాతలకు బాసటగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆమె డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి








