ఈ సినిమాల పేర్లు కూడా మీరు వినుండరు.. కానీ వీటి రేంజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక్కసారి ఆలోచించండి…
మనం రూ.500, రూ.1000 ఖర్చు చేసి స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తాం. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కల్కి‘ లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తే గర్వపడతాం. సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం. ఆ విజయాన్ని మన విజయంలా సెలబ్రేట్ చేసుకుంటాం. అదేమీ తప్పు కాదు.
కానీ అదే సమయంలో సినిమాల పరంగా మరో భారతదేశం కూడా ఉంది. అక్కడ స్టార్ హీరోలు లేరు. వందల కోట్ల బడ్జెట్ లేదు. భారీ ప్రచారం లేదు. అయినా ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాన్స్, సన్డాన్స్, వెనిస్, బెర్లిన్, టొరంటో వంటి ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో భారతదేశానికి గౌరవం తీసుకొస్తున్న సినిమాలు ఉన్నాయి. విదేశీ ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొడుతున్న ఆ సినిమాలు… మన దేశంలో మాత్రం ఖాళీ థియేటర్లతో వెలాతెలా పోతున్నాయి. ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు మనం గొప్ప సినిమాలను మిస్ అవుతున్నామా?
ఆస్కార్ రేసుకు వెళ్లిన సినిమా… బాక్సాఫీస్ వద్ద మాత్రం రూ.3 కోట్లు!
ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ముందుగా ‘హోమ్‌బౌండ్’ సినిమా గురించి తెలుసుకోవాలి. దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ తెరకెక్కించిన ఈ చిత్రం కరోనా సమయంలో వలస కూలీల జీవితాన్ని ఎంతో హృదయాన్ని కదిలించేలా చూపించింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ కావడమే కాదు, హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మార్టిన్ స్కోర్సేసీ ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతేకాదు, 2026 ఆస్కార్ అవార్డులకు భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా కూడా ఎంపికైంది.
ఇంతటి ఘనత సాధించిన సినిమా భారత థియేటర్లలో ఎంత వసూలు చేసిందో తెలుసా? కేవలం రూ.3.04 కోట్లు. ప్రపంచం మెచ్చిన సినిమా… మన దగ్గర మాత్రం ప్రేక్షకులు లేక ఓడిపోయింది. ఇది ఒక్క ‘హోమ్‌బౌండ్’ కథ కాదు. 2025లో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న చాలా భారతీయ సినిమాల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది.
అంతర్జాతీయ జ్యూరీలు వీటికి అగ్ర పురస్కారాలను ఇస్తాయి, ఓటీటీ సంస్థలు వీటి డిజిటల్ హక్కుల కోసం పోటీ పడతాయి, విదేశీ విమర్శకులు ప్రశంసలతో ముంచెత్తుతారు. కానీ, మన దేశంలో మాత్రం ఈ సినిమాలకు కనీసం థియేటర్లు దొరకవు, చూసేందుకు ప్రేక్షకులు ఉండరు, అసలు ఇలాంటి ఒక సినిమా ఉందనే విషయమే చాలా మందికి తెలియదు.
ప్రపంచం మెచ్చింది… కానీ మనం పట్టించుకోలేదు
డోంట్ టెల్ మదర్ (Don’t Tell Mother): అనూప్ లోకూర్ దర్శకత్వంలో వచ్చిన ఈ కన్నడ చిత్రం స్కూల్లో హింస, ఇంట్లో మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే ఒక తొమ్మిదేళ్ల బాలుడి కథను ఆవిష్కరిస్తుంది. బుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కానీ థియేటర్లలో దీని వసూళ్లు చాలా నామమాత్రంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
శబర్ బొండ (Sabar Bonda / కాక్టస్ పియర్స్): గ్రామీణ మహారాష్ట్రలో స్వలింగ సంపర్కం (Queer desire) నేపథ్యంలో సాగే ఈ మరాఠీ చిత్రం సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది. దర్శకుడు రోహన్ పరశురామ్ కనవాడే రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 2025లో విడుదలై రూ. 3 నుండి 4 కోట్ల వరకు వసూలు చేసింది. ఒక స్వతంత్ర (Indie) సినిమాగా ఇది మంచి వసూళ్లే సాధించినప్పటికీ, దక్కాల్సినంత ప్రచారం దీనికి లభించలేదు.
విముక్త్ (Vimukt): వృద్ధ దంపతులు తమ మానసిక వికలాంగుడైన కుమారుడిని మహా కుంభమేళాకు తీసుకువచ్చే భావోద్వేగ భరిత కథ ఇది. జితాంక్ సింగ్ గుర్జర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ ఏషియన్ ఫిల్మ్’ అవార్డు వచ్చింది. థియేటర్లలో కేవలం రూ. 50 లక్షల లోపే వసూలు చేసిన ఈ సినిమా ప్రస్తుతం చాలా మందికి తెలియకుండానే ఉండిపోయింది.
సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్ (Songs of Forgotten Trees): వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా అనుపర్ణ రాయ్ ఈ సినిమాతో చరిత్ర సృష్టించారు. ముంబై శివార్లలో ఇద్దరు వలస మహిళల మధ్య ఏర్పడిన బంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా ఇంకా భారత్‌లో విడుదల కాలేదు.
జుగ్నుమా: ది ఫేబుల్ (Jugnuma: The Fable): లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా నిలిచిన తొలి భారతీయ సినిమా ఇది. రామ్ రెడ్డి దర్శకత్వంలో హిమాలయాల నేపథ్యంలో సాగే ఈ మైథిలాజికల్ జర్నీలో మనోజ్ బాజ్‌పాయ్, తిలోత్తమ శోమే ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 2025లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం జీ5 (Zee5) లో స్ట్రీమ్ అవుతోంది. ఇది రూ. 5 నుండి 6 కోట్ల వరకు వసూలు చేసింది.
బక్షో బోంది (Baksho Bondi): బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయిన ఈ బెంగాలీ చిత్రంలో నటించినందుకు గాను తిలోత్తమ శోమే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. పీటీఎస్డీ (PTSD) తో బాధపడుతున్న భర్తను కాపాడుకుంటూ, ఆర్థికంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చే ఒక శ్రామిక మహిళ కథ ఇది. ఆగస్టు 2025లో విడుదలైన ఈ సినిమా రూ. 1.5 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఇది యాపిల్ టీవీ, ప్రైమ్ వీడియోలలో అందుబాటులో ఉంది.
అంగమ్మాళ్ (Angammal): ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ ఇండీ చిత్రం, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకుంది. సామాజిక ఆచారాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఒక వృద్ధురాలి కథ ఇది. డిసెంబర్ 2025లో విడుదలై రూ. 2 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ప్రస్తుతం సన్ నెక్స్ట్ (SunNXT) లో అందుబాటులో ఉంది.
బూంగ్ (Boong): మణిపూర్ నేపథ్యంలో ఒక బాలుడు తన తప్పిపోయిన తండ్రి కోసం చేసే అన్వేషణే ఈ సినిమా. లక్ష్మీప్రియ దేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫర్హాన్ అఖ్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. థియేటర్లలో కేవలం రూ. 80 లక్షల నుండి రూ. 1 కోటి మాత్రమే వసూలు చేసి, త్వరగానే థియేటర్ల నుండి వెళ్ళిపోయింది.
ఒక అరుదైన మినహాయింపు: ‘సు ఫ్రమ్ సో’ (Su From So)
ప్రతి స్వతంత్ర సినిమాకూ నిరాశే ఎదురవదు అనడానికి జె.పి. తుమినాడ్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘సు ఫ్రమ్ సో’ ఒక గొప్ప ఉదాహరణ. తీరప్రాంత కర్ణాటకలోని ఒక చిన్న పట్టణంలో జరిగే కథాంశంతో, హర్రర్, కామెడీ, జానపద అంశాల మిశ్రమంతో వచ్చిన ఈ విచిత్రమైన సినిమా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా సంచలనం సృష్టించింది. జూలై 25, 2025న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్లు వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.
వీటిలో చాలా సినిమాలు భారత బాక్సాఫీస్ దగ్గరకు వచ్చేసరికి కలెక్షన్స్ కేవలం రూ.50 లక్షల దగ్గర ఆగిపోయాయి. మరికొన్ని రూ.2 నుంచి రూ.5 కోట్ల మధ్యే ముగిశాయి. ఒకవైపు ప్రపంచం “ఇండియన్ సినిమా కొత్త స్థాయికి వెళ్లింది” అంటుంటే… మరోవైపు భారత ప్రేక్షకులకు ఆ సినిమాలు వచ్చాయనే విషయం కూడా తెలియకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే.
అయితే తప్పు ఎవరిది?
ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. మన ప్రేక్షకులు తప్పు చేస్తున్నారా? లేక నిర్మాతల మార్కెటింగ్ విఫలమవుతోందా? ప్రేక్షకులు మంచి సినిమాలు చూడరని చెప్పడం సులభం. కానీ అది పూర్తి నిజం కాదు. ఎందుకంటే ప్రేక్షకులకు తెలియని సినిమాను వాళ్లు ఎలా చూస్తారు?
ఈ సినిమాలకు భారీ ప్రచారం ఉండదు. స్టార్ హీరోలు ఉండరు. పెద్ద మల్టీప్లెక్స్‌లు సరిపడా షోలు ఇవ్వవు. రెండు మూడు రోజుల్లోనే థియేటర్ల నుంచి తీసేస్తారు. చాలామందికి సినిమా రిలీజ్ అయిందనే విషయం కూడా తెలియదు. అందుకే ఇవి బాక్సాఫీస్ వద్ద ఓడిపోతున్నాయి. అంటే సినిమా బలహీనంగా ఉండి ఫ్లాప్ కాలేదు… ప్రేక్షకుల ముందుకు సరిగా చేరకముందే ఫ్లాప్ అయిపోయింది.
ఓటీటీ వల్లే బతుకుతున్నాయా గొప్ప సినిమాలు?
ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులు పట్టించుకోని చాలా సినిమాలు… ఓటీటీలో మాత్రం కొత్త జీవితాన్ని పొందుతున్నాయి. ‘హోమ్‌బౌండ్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత దాని గురించి మాట్లాడినవారి సంఖ్య పెరిగింది. ‘జుగ్నుమా’ జీ5లో కొత్త ప్రేక్షకులను సంపాదించుకుంది. ‘అంగమ్మాళ్’ సన్ఎన్ఎక్స్టీలో అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని సినిమాలు ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో అద్దెకు లభిస్తున్నాయి. ‘డోంట్ టెల్ మదర్’ వంటి సినిమాలు ముబీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
అంటే ఇప్పుడు ఇండియన్ ఇండిపెండెంట్ సినిమాలకు నిజమైన థియేటర్… ఓటీటీయేనా? ఈ ప్రశ్నకు ఇండస్ట్రీ సమాధానం వెతకాల్సిన సమయం వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త అనుభవం కాదు
మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘మల్లేశం’, ‘బలగం’… ఈ సినిమాలు విడుదలైన మొదటి రోజే భారీ హిట్ కాలేదు. కానీ కంటెంట్‌పై నమ్మకం ఉన్న ప్రేక్షకులు నోటిమాట ద్వారా వాటిని విజయవంతం చేశారు. అదే అవకాశం దేశంలోని ఇతర భాషల్లో వస్తున్న గొప్ప సినిమాలకు ఎందుకు దక్కడం లేదు? అసలు మనం వాటి గురించి తెలుసుకుంటున్నామా?
ఏదైమైనా…
ప్రతి ఏడాది ప్రపంచంలోని ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో భారతీయ సినిమాలు అవార్డులు గెలుస్తున్నాయి. భారతదేశం పేరు నిలబెడుతున్నాయి. కానీ అదే సినిమాలు మన థియేటర్లలో ప్రేక్షకుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. అయితే తప్పు ప్రేక్షకులదా? మార్కెటింగ్ వ్యవస్థదా? లేక మనం ఇప్పటికీ “స్టార్ సినిమా” అంటేనే మంచి సినిమా అనుకునే దశలోనే ఉన్నామా? జవాబు ఏదైనా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రపంచం భారతీయ గొప్ప సినిమాలను ఇప్పటికే గుర్తించింది. ఇప్పుడు మన వంతు… బాక్సాఫీస్ కలెక్షన్లను మాత్రమే కాకుండా, నిజంగా మనసును కదిలించే సినిమాలను కూడా వెతికి చూసే సమయం వచ్చిందేమో!








