ముంబైలో సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం..!
ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) రేపు (ఏప్రిల్ 25) ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ‘ఎకనమిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్స్‌లెన్స్ అవార్డుల’ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు మరియు వ్యాపార అనుకూల వాతావరణాన్ని (Ease of Doing Business) కల్పించడంలో ఆయన చూపిస్తున్న చొరవకు గుర్తింపుగా ఎకనమిక్ టైమ్స్ పత్రిక చంద్రబాబును ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ (Business Reformer of the Year) అవార్డుకు ఎంపిక చేసింది.
ముంబైలో అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సీఈవోలు మరియు ఆర్థిక నిపుణుల సమక్షంలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. 26 ఏళ్లుగా కార్పొరేట్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గౌరవిస్తున్న ఈ సంస్థ, ఈ ఏడాది రాజకీయ-ఆర్థిక సంస్కరణల విభాగంలో చంద్రబాబును విజేతగా ప్రకటించడం విశేషం.
చంద్రబాబు గతంలోనూ ‘విజనరీ లీడర్’గా పేరు గాంచారు. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పాలసీలను తీసుకురావడం, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచడం వంటి అంశాలను ఈ అవార్డు ఎంపిక కమిటీ ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రాన్ని మళ్ళీ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చడంలో ఆయన చేస్తున్న కృషికి ఈ అంతర్జాతీయ స్థాయి అవార్డు దక్కడం పట్ల తెలుగు తమ్ముళ్లు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేపు ఉదయం అమరావతి నుంచి బయలుదేరి ముంబై చేరుకుంటారు. అవార్డు ప్రధానోత్సవం అనంతరం అక్కడ పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి, రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.
ఇవి కూడా చదవండి








