షర్మిల పోటీ చేసేది ఇక్కడి నుంచే!
తెలంగాణలో పార్టీ ఏర్పాటుకోసం వడివడిగా అడుగులు వేస్తున్న షర్మిల.. తాను ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనేదానిపై క్లారిటీ ఇచ్చింది. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో సమావేశమైన షర్మిల.. ఈ విషయం వెల్లడించారు. వైఎస్‌కు పులివెందుల ఎలాగో… తనకు పాలేరు అలాగా అని చెప్పారు
వచ్చే నెల 9న ఖమ్మంలో షర్మిల బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ వేదిక నుంచే నూతన పార్టీ ఏర్పాటును ప్రకటిస్తానని గతంలోనే చెప్పారు. బహిరంగ సభ సన్నాహక సమావేశాలపై పార్టీ అభిమానులతో షర్మిల సుదీర్ఘంగా చర్చించారు. ఖమ్మం జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అందుకే ఆ జిల్లా నుంచే బరిలోకి దిగాలనుకుంటున్నట్టు చెప్పారు. పాలేరు ఇందుకు సరైన వేదికగా నిర్ణయించారు.
షర్మిల ఖమ్మం జిల్లాను ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. తన మెట్టినిల్లు ఖమ్మం జిల్లాయే. తాను ఖమ్మం జిల్లా కోడలినని చెప్తుంటారు షర్మిల. అంతేకాక.. 2014లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ సీటుతో పాటు, మూడు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెల్చుకుంది. ఖమ్మం జిల్లాలో వైఎస్‌ను అభిమానించే నేతలు, అభిమానులు ఎక్కువగా ఉన్నారని షర్మిల భావిస్తున్నారు. వైసీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
తెలంగాణలో రాజన్నరాజ్యం తేవడమే లక్ష్యంగా తాను పార్టీ పెట్టబోతున్నట్టు షర్మిల ప్రకటించారు. తెలంగాణలో సమస్యలు రాజ్యమేలుతున్నాయని.. అధికార టీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. తన స్థానికత్వం విమర్శలు చేస్తున్నవారికి కూడా షర్మిల ఘాటుగా బదులిచ్చారు. కేసీఆర్, విజయశాంతి కూడా తెలంగాణ వాసులు కాదన్నారు. పార్టీ సన్నాహకాల్లో భాగంగా ఆమె రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెలలో బహిరంగసభ ద్వారా ఆమె ప్రత్యక్ష బరిలోకి దిగబోతున్నారు.













