కడపలో అవినాశ్ నెత్తిన పాలుపోసిన షర్మిల..!?
ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా మళ్లీ పాగా వేయాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం వై.ఎస్.షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా రంగంలోకి దింపింది. అయితే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే కొన్ని చోట్ల గణనీయమైన ఓట్లు సాధించడం ద్వారా ఇతరుల గెలుపోటములను ప్రభావితం చేయగలిగింది. ముఖ్యంగా కడపలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి గెలుపుకు వైఎస్ షర్మిల పరోక్షంగా దోహదం చేసిందనే టాక్ వినిపిస్తోంది.
వైఎస్ కుటుంబంలో విభేదాల సంగతి మనకు తెలిసిందే. వైసీపీ అధినేత జగన్ తో విభేదించి సోదరి షర్మిల బయటికొచ్చారు. మొదట తెలంగాణలో పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి చివరకు ఏపీకి చేరారు. ఏకంగా పీసీసీ పగ్గాలు చేపట్టి అన్నపైనే పోరుకు సై అన్నారు. అంతేకాక కడపలో అవినాశ్ రెడ్డిపైనే ఏకంగా ఎంపీ బరిలో నిలిచారు షర్మిల. దీంతో అందరి చూపూ కడప పైన పడింది. అవినాశ్ ను షర్మిల ఓడిస్తారా.. అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. టీడీపీ కూడా బరిలో నిలవడంతో ఇక్కడ ట్రయాంగిల్ వార్ నడుస్తుందనుకున్నారు.
అయితే కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసారి గెలిచారు. అయితే కేవలం 62వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే అవినాశ్ రెడ్డి బయటపడ్డారు. 2019 ఎన్నికల్లో 3లక్షల 80వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచిన అవినాశ్ రెడ్డి ఈసారి కేవలం 62వేల ఓట్లతో గెలిచారు. అవినాశ్ రెడ్డికి 6లక్షల 5వేల ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి 5లక్షల 42వేల ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన షర్మిలకు లక్ష 42వేల ఓట్లు వచ్చాయి. దీంతో షర్మిల వల్లే అవినాశ్ రెడ్డి గెలిచారని.. లేకుంటే టీడీపీ అభ్యర్థి గెలిచేవాడని అనుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి హవా నడిపించింది. వైసీపీ కంచుకోటలు కూడా ఈసారి బద్దలైపోయాయి. కడపలో కూడా షర్మిల బరిలోకి దిగకుండా ఉంటే కచ్చితంగా ఇక్కడ అవినాశ్ రెడ్డి ఓడిపోయేవాడని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. షర్మిలకు వచ్చిన లక్ష 40వేల ఓట్లు కచ్చితంగా టీడీపీకి పడేవని.. అందులో లక్ష ఓట్లు పడినా కూడా టీడీపీదే విజయమని అంచనా వేస్తున్నారు. ట్రయాంగిల్ వార్ లో షర్మిల వల్ల టీడీపీకి నష్టం జరిగిందని.. అవినాశ్ రెడ్డి గెలుపుకు ఆమె దోహదపడిందని చెప్తున్నారు. అవినాశ్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనుకున్న షర్మిల.. పరోక్షంగా ఆయన గెలుపుకు దోహదపడడంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.













