YS Jagan: జగన్కు మరీ తొందర ఎక్కువయిందా..!?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలవుతోంది. అధికారులు, ఉద్యోగుల బదిలీలు (transfers) మొదలుపెట్టి ఇప్పుడిప్పుడే సెట్ రైట్ అవుతోంది చంద్రబాబు ప్రభుత్వం. టీడీపీ (TDP) హామీ ఇచ్చిన సిక్స్ గ్యారంటీలు (Six guarantees) కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వరదలు, ఇతరత్రా కారణాల వల్ల ప్రభుత్వం ఇంకా పూర్తిగా కుదుట పడలేదనే చెప్పాలి. అయితే వైసీపీ (YSRCP) మాత్రం కూటమి ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టాలని నిర్ణయించింది.
ఏపీలో చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం (NDA Govt) జూన్ 12న కొలువదీరింది. మొదటి నెల నుంచి హామీ ఇచ్చినట్లు 4వేల రూపాయలకు పెంచి ఒకటోతేదీనే పెన్షన్లు (pensions) ఇస్తోంది. మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ ఇచ్చింది. అన్నా క్యాంటీన్లను (Anna canteen) ప్రారంభించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) ను రద్దు చేసింది. రాజధాని అమరావతి (Amaravati) పనులను మళ్లీ పట్టాలెక్కించింది. అమరావతి, పోలవరం (Polavaram) తదితర పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోగలిగింది. ఉచిత ఇసుక (Free Sand) అమలు చేసింది కానీ దానిపై అనేక వివాదాలు నెలకొన్నాయి. ఇది పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.
అయితే నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని విమర్శిస్తోంది వైసీపీ. ఉచిత ఇసుక అమలు కావట్లేదని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు (law and order) అస్సులు లేవని ఆరోపిస్తోంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు జగన్ త్వరలోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ నుంచి బస్సు యాత్ర (bus yatra) లేదా మినీ పాదయాత్రలు (padayatra) చేపట్టాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. అయితే జగన్ నిర్ణయంపై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. జగన్ మరీ తొందర పడుతున్నారని చెప్తున్నారు.
అయితే జగన్ ఆలోచన మరోలా ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కాదంబరీ జెత్వానీ (Kadambari jetwani), చంద్రబాబు ఇంటిపై దాడి, టీడీపీ ఆఫీసుపై (TDP Office) దాడి, రఘురామకృష్ణంరాజుపై (Raghu Rama Krishnam Raju) వేధింపులు లాంటివి వైసీపీ మెడకు చుట్టుకున్నాయి. ఇక తిరుమల లడ్డూలో (Tirumala Laddu) కల్తీ నెయ్యి (adulterated ghee) వ్యవహారం దేశమంతా దుమారం రేపింది. ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడమే మార్గం అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎదురుదాడి చేయడం ద్వారా ప్రభుత్వం తనపై తొందరపాటు చర్యలు తీసుకోబోదని భావిస్తున్నట్టు సమాచారం.
అదే సమయంలో పూర్తిగా దిగాలు పడిపోయిన పార్టీ (party cadre) కేడర్ ను కాపాడుకోవాలంటే జనంలోకి వెళ్లడమే మార్గమని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నేతలే ఇటీవల వదిలేసి వెళ్లిపోయారు. రేపోమాపో పలువురు ప్రజాప్రతినిధులు, కీలక నేతలు కూడా గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ నిజంగా రెడ్ బుక్ (red book) ఓపెన్ చేస్తే వైసీపీకి రాజకీయ సమాధి తప్పదేమోనన్న భయం కూడా ఉంది. అందుకే పార్టీని కాపాడుకోవాలంటే ప్రజల మధ్యన ఉంటూ వాళ్లను కవచంలా వాడుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. అయితే కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాది కూడా సమయం ఇవ్వకుండానే జగన్ తన స్వార్థం కోసం ఇలా చేయడం సరికాదని పలువురు వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.













