దళితులపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠినచర్యలు: వైఎస్ జగన్
రాష్ట్రంలో దళితులపై జరిగిన దాడులు సంచలనంగా మారిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కఠిన వ్యాఖ్యలు చేశారు. సీతానగరం శిరోముండనం ఘటన నేపథ్యంలో మాట్లాడుతూ, గుండు కొట్టించడం వంటి ఘటనలు అమానుషం అని అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ విషయంలో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందన్నారు. గతంలో దళితులపై దాడి జరిగినా పట్టించుకునేవారు కాదని, ఇప్పుడు ఆ విషయంలో అవసరమైతే పోలీసులను కూడా జైల్లో పెడుతున్నామని అన్నారు. ఇలా ఎస్ఐని జైల్లో పెట్టిన ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఎస్సై అయినా, సీఐ అయినా సరే తప్పు చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. దళితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ప్రభుత్వం తమదన్నారు. తమ రాష్ట్రంలో హోంమంత్రి దళిత వర్గానికి చెందిన మహిళ అని, డీజీపీ ఎస్టీ అని వెల్లడించారు. సమాజంలో దిగువ వర్గాల వారికి రక్షణగా ఉండాల్సింది పోలీసులేననే సందేశాన్ని పోలీసు వ్యవస్థలో దిగువస్థాయి దాకా తీసుకెళ్లాలని కోరారు.













