అప్పుడలా.. ఇప్పుడిలా..! ఈవీఎంలపై మాట మార్చేసిన జగన్..!!
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఐదేళ్లపాటు అధికారం చెలాయించవచ్చు. ఓడితే ఇంటికి పరిమితం కావాల్సి వస్తుంది. గెలిచిన వాళ్లు ఆనందంతో సంబరాలు చేసుకుంటే.. ఓడిన వాళ్లు సాకులు వెతుక్కుంటూ ఉంటారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం అని చెప్పకుండా ఫలానా కారణం వల్ల ఓడిపోయామంటూ నెపాన్ని మరేదో అంశంపైకి నెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీకి ఇప్పుడు 39శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. తాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని.. అయినా వాళ్లందరి ఓట్లు ఏమయ్యాయో అర్థం కావట్లేదని సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత జగనే అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈవీఎంల పనితీరుపై సర్వత్రా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లనే ఎన్నికలకు వినియోగిస్తున్నాయని జగన్ ట్వీట్ చేశారు. అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టుకున్నట్టవుతుందన్నారు. న్యాయం జరగడం మాత్రమే కాదని.. జరిగినట్లు కూడా కనిపించాలని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే జగన్ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల సమయంలో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ, జనసేన కూడా ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశాయి. అయితే జగన్ మాత్రం నాడు ఈవీఎంలను వెనకేసుకొచ్చారు. ఈవీఎంల ద్వారా అవకతవకలు జరిగేందుకు అవకాశమే లేదని స్పష్టం చేశారు.
ఇప్పుడు ఓడిపోయే సరికి ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. ఎలాన్ మస్క్ తో పాటు ఈవీఎంలను తప్పుబడుతున్న పలువురిని కోట్ చేస్తున్నారు. అయితే నిన్నమొన్నటి వరకూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఈవీఎంలను తప్పుబడుతూ వచ్చాయి. అప్పుడు వాటిని సమర్థించి ఈవీఎంలకు అనుకూలంగా మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పుడు ఇలా మాట్లాడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గెలిస్తే ఒకలాగా.. ఓడితే మరోలాగా మాట్లాడవద్దని పలువురు సూచిస్తున్నారు.













