YS Jagan: జగన్ బంగారుపాళ్యం పర్యటనకు లైన్ క్లియర్..! పోలీసులు ఏం చేస్తారో..!?

ఆంధ్రప్రదేశ్ లో మామిడి బాగా పండే జిల్లాల్లో చిత్తూరు (Chittoor) జిల్లా ముందుంది. అయితే ఈసారి తోతాపురి (Totapuri) మామిడి రైతులు గిట్టుబాటు ధర లభించకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ఈ నెల 9న బంగారుపాళ్యం (Bangarupalyam) మార్కెట్ యార్డ్ ను సందర్శించి రైతులను పరామర్శించనున్నారు. ఈ పర్యటనకు పోలీసులు షరతులతో అనుమతి ఇచ్చినప్పటికీ, రాజకీయ వివాదాలు, ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లభించకపోవడం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) పాత్ర ఉందని టీడీపీ విమర్శిస్తోంది.
చిత్తూరు జిల్లా తోతాపురి మామిడి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఈ జిల్లాలో సుమారు 1.12 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉండగా, దాదాపు 5.5 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతోంది. అయితే, ఈ ఏడాదిలో అధిక దిగుబడి కారణంగా మామిడి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. పల్ప్ యూనిట్లు కిలోకు రూ.5-6 మాత్రమే చెల్లిస్తుండగా, రైతులు కనీస మద్దతు ధర (MSP) రూ.12 కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో చాలా చోట్ల రైతులు మామిడ పంట కోసేందుకు కూడా ముందుకు రావట్లేదు. చాలా మంది పంటను అలాగే వదిలేశారు.
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రైతుల సమస్యలను హైలైట్ చేసేందుకు జులై 9న బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ ను సందర్శించనున్నారు. గతంలో మిర్చి, పొగాకు రైతుల సమస్యలపై పర్యటనలు చేసిన జగన్, ఈసారి మామిడి రైతులకు సంఘీభావం తెలపనున్నారు. అయితే, ఈ పర్యటనకు పోలీసులు మొదట అనుమతి నిరాకరించినప్పటికీ, ఇప్పుడు 500 మందితో మాత్రమే సందర్శనకు అనుమతించారు. వైసీపీ నాయకులు 10,000 మందితో పర్యటనకు అనుమతి కోరగా, పోలీసులు ఆంక్షలు విధించడం వివాదాస్పదమైంది. గతంలో రెంటపాళ్ల పర్యటనలో ఆంక్షల ఉల్లంఘన కారణంగా ఇద్దరు కార్యకర్తలు మరణించడంతో పోలీసులు ఆంక్షలు కట్టుదిట్టం చేశారు.
మరోవైపు.. వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పల్ప్ పరిశ్రమలను తన అధీనంలో ఉంచుకుని, తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లభించకుండా అడ్డుకుంటున్నారని వాళ్లు విమర్శిస్తున్నారు. పెద్దిరెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు రైతులకు అన్యాయం చేస్తున్నాడని, ఈ కారణంగానే పల్ప్ యూనిట్లు మామిడిని కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే రైతులను ఆదుకోవడంలో విఫలమైన టీడీపీ, ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తోందని వైసీపీ ఖండిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోతాపురి మామిడికి టన్నుకు రూ.12,000 (కిలోకు రూ.12) గిట్టుబాటు ధరను నిర్ణయించింది. ఇందులో రూ.8 పల్ప్ యూనిట్లు చెల్లిస్తాయి. మిగిలిన రూ.4 సబ్సిడీగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ సీజన్‌లో 5.5 లక్షల టన్నుల మామిడిని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఈ పథకానికి రూ.220 కోట్లు ఖర్చు చేయనుంది. అయితే కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే తక్కువ ధర మామిడితో స్థానిక రైతులకు నష్టం జరుగుతోంది. దీంతో జూన్ 7 నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మామిడి దిగుమతులపై నిషేధం విధించింది. ఇది సహకార స్ఫూర్తికి విరుద్ధమని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుబట్టారు.
మరోవైపు.. జగన్ పర్యటన మరోసారి రాజకీయ రంగు పులుముకుంటోంది. రైతుల సమస్యలపై ఏమాత్రం ప్రేమలేని జగన్ రాజకీయ లబ్ధి కోసం పర్యటిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ ఎప్పుడు బయటికొచ్చినా బలప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తారు తప్ప సమస్య గురించి ఆలోచించరని ఎద్దేవా చేస్తున్నారు. రైతుల పట్ల నిజంగా బాధ ఉంటే 10వేల మంది రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ బంగారుపాళ్యం పర్యటన ఈసారి ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.