హోదా ఇవ్వకుంటే రాజీనామా : వైసీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఊపిరి, దాని కోసం ఊపిరి ఉన్నంత వరకూ వైసీపీ పోరాటం చేస్తూనే ఉంటుదని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో పాదయాత్రలో భాగంగా సభ జరిగింది. మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగే పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు ప్రత్యేకహోదా కోసం నిరంతరం పోరాటాలు చేస్తారని సభలో జగన్ ప్రకటించారు. అప్పటికీ హోదా ప్రకటించకుంటే బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్ 6న నిరసన తెలుపుతూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని ప్రకటించారు. దీనికి ముందుగా, హోదా కోసం మార్చి 1న జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ల ముట్టడి, 5న హోదా మ హక్కు- ప్యాకేజీ మాకొద్దు అంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎంపీలు ధర్నా చేస్తారని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలకు కేంద్ర స్పందించకుంటే చివరి అస్త్రంగా బడ్జెట్ సమావేశాల ముగింపు రోజు తమ ఎంపీలు రాజీనామా చేస్తారన్నారు.













