ఒకే దెబ్బకి రెండు పిట్టలు..! కోటం రెడ్డికి భారీ షాక్ ఇచ్చిన సీఎం జగన్
ఈ మధ్య నెల్లూరు వైసీపీలో రాజకీయ సెగలు రేగుతున్న విషయం తెలిసిందే. అక్కడి రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధిష్టానానికి ఎదురు తిరగడం, తన కాల్స్ ట్యాప్ చేస్తున్నారని, అందుకే తాను పార్టీ వీడుతున్నానని బహిరంగంగా ప్రకటిచండంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో వెంటనే ఆయనను పార్టీ నుంచి తొలగించారు. అదే సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా ప్రకటించి కోటం రెడ్డికి భారీ షాకిచ్చారు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనే సామెత నిజమైంది. ఒకపక్క నియోజకవర్గంలోని కార్యకర్తల్లో అటు పార్టీ వైపు ఉండాలా..? ఇటు కోటం రెడ్డిని సపోర్ట్ చేయాలా..? అనే సందిగ్ధం, మరో పక్క కోటం రెడ్డిని తొలగిస్తే ఆ స్థానంలో ఎవరనే అనుమానం.. ఈ రెండు సమస్యలకూ ఒకే దెబ్బతో జగన్ చెక్ పెట్టేసినట్లైంది. మొదటగా రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డితో భేటీ అయిన సీఎం జగన్.. కొత్త ఇంఛార్జ్ ఎంపికపై చర్చించారు. తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని, సజ్జల రామకృష్ణా రెడ్డితోనూ సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును ఫైనల్ చేసిన జగన్.. సజ్జల ద్వారా ఆదాల పేరును అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. తనను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించడంపై ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. అందరితో కలిసి పనిచేసి.. నెల్లూరు రూరల్‌లో మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తానని హామీ ఇచ్చారు.













