Jagan: తల్లికి వందనం హామీపై జగన్ ఫైర్.. కూటమిపై విమర్శలు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన “సూపర్ సిక్స్” (Super six)హామీల అమలు విషయంలో వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా, ఆ హామీలు ఇప్పటి వరకు అమలు కాకపోవడం పట్ల జగన్ (Jagan) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలను నమ్మి కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రజలు మద్దతు ఇచ్చారని, అయితే ఆ హామీలు అమలుకావడం లేదని విమర్శించారు.
ఎక్స్‌లో జగన్ పోస్ట్ చేస్తూ, “ప్రజలకు ఇచ్చిన మాటపై ఇంత తేలికగా వ్యవహరిస్తారా చంద్రబాబూ? లక్షలాది తల్లులు, పిల్లలు మీ పథకాల కోసం ఎదురుచూస్తున్నారు. మీరు వారిని నిరాశకు గురిచేస్తున్నారా?” అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తల్లికి వందనం (Talliki Vandhanam) పథకం కింద ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15 వేలు, పిల్లల సంఖ్య ఆధారంగా మరింత సాయం అందిస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ హామీ అమలు కాలేదని జగన్ మండిపడ్డారు.
వైసీపీ హయాంలో “అమ్మ ఒడి” (Amma vadi ) పథకం కింద 44.48 లక్షల తల్లులకు, 84 లక్షల పిల్లలకు మొత్తం రూ.26,067 కోట్లు అందజేశామని జగన్ తెలిపారు. అయితే, ప్రస్తుతం “తల్లికి వందనం” హామీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇంత వరకు అమలుకు సంబంధించిన ప్రకటన చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. కేబినెట్ మీటింగ్‌ల తర్వాత కూడా ఈ పథకంపై స్పష్టత లేకపోవడం ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని చెప్పారు.
ఇక రైతుల పట్ల కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని జగన్ ఆరోపించారు. “రైతు భరోసా” పేరిట ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం రైతులకు సాయాన్ని క్రమం తప్పకుండా అందించిన విషయాన్ని గుర్తుచేశారు.
జగన్ తన పోస్ట్‌లో సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటి ప్రస్తావిస్తూ అవి అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “తల్లికి వందనం”లో మోసం, రైతు భరోసాలో మోసం, నిరుద్యోగ భృతిలో మోసం అంటూ పలు అంశాలపై నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కి, నమ్మకద్రోహం చేస్తే ప్రజలు త్వరలోనే మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.వైసీపీ ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని జగన్ స్పష్టం చేశారు. కూటమి హామీల అమలుకు చొరవ చూపకపోతే ఇది ప్రజా వ్యతిరేకతకు దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.













