‘నా చేతుల్లో లేని అంశానికీ బాధ్యత వహించాల్సి వస్తోంది’ : జగన్ ఆవేదన

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత కష్టపడుతున్నా, ప్రయత్నాలు చేస్తున్నా కూడా, కొన్ని కొన్ని తమ చేతుల్లో లేని అంశాలకు కూడా తాము బాధ్యత వహించాల్సి వస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని, చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రుయా మృతుల కుటుంబాలకు సీఎం జగన్ 10 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
‘‘తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందున, ఆక్సిజన్ కొరత ఏర్పడిందని, 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే నిన్న కూడా ఆరు ట్యాంకర్లను గన్నవరం ఏయిర్ పోర్ట్ నుంచి ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఏయిర్ లిఫ్ట్ చేశాం. అక్కడ నింపి… రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం’’ అని జగన్ పేర్కొన్నారు. ఇన్ని రకాలుగా ఆక్సిజన్ కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తునే ఉన్నామని, ఇన్ని చేసినా, కొన్ని కొన్ని మన చేతుల్లో లేకపోవడం వల్ల నష్టాలు జరుగుతున్నాయి. కలెక్టర్లందరూ అత్యంత అప్రమత్తతతో ఉండాలని జగన్ ఆదేశించారు. కోవిడ్ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో ఎదుర్కోవాలని సూచించారు.
వ్యాక్సిన్ల పంపిణీ కేంద్ర నియంత్రణలో ఉంటుంది
వ్యాక్సిన్ల పంపిణీ అనేది కేంద్రం నియంత్రణలో ఉంటుందని జగన్ పునరుద్థాటించారు. ఈ మేరకు సుప్రీంలో కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేసిందని, జనాభా ప్రాతిపదికన కోటాను నిర్ధారిస్తామని పేర్కొందని ఆయన తెలిపారు. ఇలాంటి సమయంలో కూడా ప్రతిపక్షాలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి మాటల వల్ల ప్రజల్లో భయాందోళనలకు గురి అవుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.