Liquor Scam: సిట్ ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌లో ముడుపుల జాడలు.. జగన్ పాత్రపై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంపై ( Liquor Scam) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా కీలక ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించింది. సుమారు 305 పేజీలుగా ఉన్న ఈ ఛార్జ్‌షీట్‌తో పాటు 70 వాల్యూముల డాక్యుమెంట్లు, అనేక ఆధారాలను కోర్టుకు జమచేశారు. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం సరఫరా, కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై సమగ్రంగా వివరించారని సమాచారం. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పేరును కొన్ని చోట్ల ప్రస్తావించినా ఆయనను నేరుగా నిందితుడిగా చేర్చలేదు.
ఈ కేసులో ఇప్పటికే 40 మందికి పైగా వ్యక్తులు, కంపెనీలు నిందితులుగా ఉన్న నేపధ్యంలో ఇటీవల మరో 8 మందిని చేర్చారు. మొత్తం మీద 16 మందిపై అభియోగాలు మోపారు. మద్యం సరఫరా అర్హత గల కంపెనీలు, డిస్టిలరీల నుంచి నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకూ ముడుపులు ఎలా వసూలు చేసేవారన్న అంశాన్ని ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. ఆ మొత్తాన్ని ఎక్కడ నిల్వచేశారు, ఎవరి ద్వారా ఎలా పంపిణీ చేశారు అనే అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందో, ఎవరు ఎలా ప్రమేయం చూపారో వివరంగా న్యాయపరమైన అభియోగాలు రూపొందించారు.
దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు మొత్తం 104 పోరెన్సిక్ నివేదికలు, 130కి పైగా ల్యాప్టాప్‌లు, మొబైల్ ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కోర్టుకు సమర్పించారు. మద్యం కుంభకోణం కేసు ఏపీ సీఐడీ (CID) ద్వారా గతేడాది నమోదయ్యింది. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది ఫిబ్రవరి 5న విజయవాడ (Vijayawada) సిటీ పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ బాబు (SV Rajasekhar Babu) నేతృత్వంలో S.I.T ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు సిట్ 12 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో మొదట రాజ్ కెసిరెడ్డి (Raj Kesireddy)ని అరెస్ట్ చేయగా, ఆ తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy), భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ (Govindappa Balaji), జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy), చెవిరెడ్డి భాస్కర రెడ్డి (Chevireddy Bhaskara Reddy), ఎస్‌పీవై డిస్టిలరీస్ మాజీ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి (Sajjala Sridhar Reddy) తదితరులను అరెస్ట్ చేశారు. తాజాగా శనివారం ఎంపీ మిథున్ రెడ్డిని (Mithun Reddy) అరెస్ట్ చేయడం ఈ వ్యవహారంపై మరింత చర్చను తెచ్చింది. చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాల ప్రకారం, ఈ వ్యవహారం ఇంకా ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.